29 August, 2026 | 3:38 AM

మద్యం మత్తు.. ఆపై జూదం చిత్తు!

29-08-2026 02:31 AM
  1. పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో బహిరంగంగా జూదం
  2. మద్యం మత్తులో డబ్బులు పోగొట్టుకుంటున్న వైనం

అలంపూర్, ఆగస్టు 28: పుల్లూరు టోల్ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వైన్షాపులకు వెళ్లే ప్రధాన మార్గం ఎదుట కొందరు బహిరంగంగా జూదం ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం సేవించిన కొందరు పక్కనే జరుగుతున్న జూదం వైపు మళ్లి, మత్తులో డబ్బులు పోగొట్టుకుంటున్నారని ప్రయాణికులు,స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మద్యం మత్తులో జూదానికి ఆకర్షితులై చేతిలోని డబ్బులు కోల్పోవడం వల్ల కుటుంబ అవసరాలకు ఇబ్బందులు

ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదంలోకి వెళ్లి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జాతీయ రహదారి పక్కనే, వైన్షాపుల సమీపంలోనే ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బహిరంగ జూదాన్ని అరికట్టాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.