డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ గుండ్లపల్లి గ్రామంలోని 7వ వార్డులో నిర్వహించిన డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రతి వారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని అన్నారు. ఇళ్లలోని నీటి ట్యాంకులు, పాత డబ్బాలు, పాత్రలు వంటి వాటిలో నిల్వ ఉండే నీటిని పూర్తిగా తొలగించి శుభ్రపరచాలని సూచించారు. కూలర్లను తరచుగా శుభ్రం చేయడం, కొబ్బరి చెక్కలు, పాత టైర్లు వంటి వ్యర్థాలను తొలగించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చన్నారు.
ప్రతి కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే దోమలు శుభ్రమైన నిల్వ నీటిలోనే పెరుగుతాయని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలనీలలో ఉన్న ఓపెన్ డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులకు సూచించారు. దోమల నివారణ చర్యలను నిరంతరం కొనసాగించాలని చెప్పారు. అనంతరం కాలనీలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, మున్సిపల్ సిబ్బందితో వీలైనంత త్వరగా డ్రైనేజీ వ్యవస్థ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు బబ్బూరి శ్రీధర్ గౌడ్, లావణ్య శ్రీధర్ గౌడ్, నాయకులు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, ఎరుకల హేమేంధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి డాక్టర్ పావని, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.






