జపాన్‌లో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రత
టోక్యో, ఆగస్టు 23: జపాన్‌ను మరోమారు భూకంపం వణికించింది. ఆదివారం తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారు భయంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో 46 మందికిపైగా గాయపడినట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసి తరువాత ఉపసంహరించుకున్నారు. ఫ్రిఫెక్చర్‌లో 23 మంది, సైతామాలో 9మంది, కనగావాలో 9మంది, చిబాలో 4, ఇబరాకిలో ఒకరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో సముద్రమట్టం నుంచి 70కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 5.8గా నమోదు చేసింది. భూకంపం కారణంగా టోక్యో, నరిటా విమానాశ్రయాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే లోకల్ రైళ్లు ఆలస్యమయ్యాయని, పలు రైళ్లు రద్దయ్యాయని ఈస్ట్ జపాన్ రైల్వే సంస్థ ప్రకటించింది. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరిన్ని ప్రకంపనలు రావొచ్చని పాన్ వాతావరణ విభాగం (జేఎంఎ) హెచ్చరించింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు దెబ్బతిన్నాయని జపాన్ ప్రధానమంత్రి సనయీ తకాయిచి ‘ఎక్స్’లో తెలిపారు. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భూకంపం ధాటికి టోక్యోలోని పలు ప్రాంతాల్లో నష్టానికి సంబం ధించిన దృశ్యాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.






