రిజర్వేషన్లను రద్దు చేయలేం
- సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న వారికోసం అమలు
- కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్
- రిజర్వేషన్ హటావో ఆందోళనపై వ్యాఖ్యలు
పాట్నా, ఆగస్టు 23: కోరినంత మాత్రాన రిజర్వేషన్లను రద్దు చేయలేమని, ఇది తరతరాలుగా సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న వర్గాలకు మద్దతు ఇచ్చేందుకు రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయమని, రద్దు చేయాలని కోరుకుంటూ నిరసనలు చేస్తున్నవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. పాట్నా విమానాశ్రయం బయట ఆదివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు పాశ్వాన్ సమాధానమిచ్చారు.
ఇదొక సున్నితమైన అంశమని, ఏ మాత్రం గందరగోళం నెలకొన్నా, దేశంలో ఎక్కువశాతం మందిలో ఆగ్రహాం, అనుమానాలు, అపోహలు రేకెత్తే అవకాశం ఉందన్నారు. ఢిల్లీలో రిజర్వేషన్ల రద్దు కోసం నిరసనలు చేస్తున్న పలువురు ఈ అంశంపై ప్రభుత్వంతో కూలంకషంగా చర్చిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. చర్చల ద్వారా తమకు ఉన్న అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు.
ఈ అంశంపై రాజకీయం చేయడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వారి పురోగతికి రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. సమాజంలో సామాజిక వివక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల నిర్ణయం జఠిలమైనదేనని వివరించారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో బిహార్ అభివృద్ధి కోసం మాట్లాడాలని, మాటిమాటికి సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో బీహార్ ఆర్థిక బలాన్ని, అభివృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తామని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు.






