ఈస్ట్, వెస్ట్ ఓకే.. సౌత్ ఎప్పుడో?
డీఎఫ్‌సీతో మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ
ఎప్పటి నుంచో ఊరిస్తున్న దక్షిణాది కారిడార్
కొత్త సర్కారు అయినా ప్రారంభిస్తుందా?
కేంద్ర మంత్రులపైనే భారం
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) : డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ (డీఎఫ్‌సీ).. ప్రత్యేక రైల్వే మార్గం ద్వారా అత్యధిక సామర్థ్యంతో సరుకు రవాణాను వేగంగా చేసేందుకు అవకాశం కల్పించేది. దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి ఉత్తరాదికి రెండు ప్రత్యేక రైల్వే సరుకు రవాణా మా ర్గాలను నిర్మించారు. కానీ దక్షిణాదిలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానం లో ఉంది. ఒకప్పుడు సరుకు రవాణా ద్వా రా అత్యధిక ఆదాయం సమకూర్చుకున్న రైల్వే శాఖ క్రమంగా ప్రయాణీకుల రైళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో గూడ్స్ రైళ్ల రాకపోకలు తగ్గి ఆదాయం కూడా తగ్గింది.
దేశంలో 13,523 రైళ్లు, 9146 గూడ్స్ రైళ్లు, 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సరుకు రవాణా రైళ్లకు రాకపోకల్లో ప్రాధాన్యం లేని ఫలితంగా సరుకు రవాణా ఆలస్యం కావడంతో చాలా మంది వ్యాపారులు, ప్రజలు అత్యవసర రవాణాకు రైల్వేను కాదని రోడ్డు వ్యవస్థపై ఆధారపడటం వల్లే ఆదాయం తగ్గిపోయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు సైతం సరుకు రవానాపై దృష్టి పెట్టక ప్రయాణీకుల రైళ్లపైనే ఫోకస్ చేశారు. వాస్తవానికి ప్రయాణీకుల రైళ్లను పెంచుతూ పోయినా సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఓ రైల్వే లైన్ వేయక పోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది.
ప్రతిపాదిత కారిడార్లు వస్తే దక్షిణాదికి ఎంతో మేలు
ప్రస్తుతం ఉత్తర భారతాన్ని కవర్ చేస్తూ తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్లు (డీఎఫ్‌సీ) తీసుకువచ్చారు. కానీ వివిధ రకాల ఖనిజాలు, సిమెంట్, ఫర్టిలైజర్, స్టీల్, ఐరన్ ఓర్, ఇతర విలువైన ఖనిజాల రవానాకు ప్రసిద్ధి చెందిన దక్షిణాది నుంచి కూడా ప్రత్యేక డీఎఫ్‌సీ ఉంటే సరుకు రవాణా మరింత వేగంగా పూర్తవుతుందని రైల్వే నిపుణులు చెబుతున్నారు. రైల్వే శాఖ ఇప్పటికే మరో 4,300 కి.మీ మేర కొత్తగా డీఎఫ్‌సీలు ప్రారంభించాలని ప్రతిపాదించింది. కోల్‌కతా నుంచి విజయవాడ, ఢిల్లీ నుంచి చెన్నై కారిడార్లను రైల్వే శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.
సౌత్ నుంచి ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం కారిడార్ నిర్మిస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. చెన్నై నుంచి హైదరాబాద్ మీదుగా వెళ్లే ఈ కారిడార్ వల్ల సరుకు రవాణా మరింత పుంజుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఒక్కో గూడ్స్ వ్యాగన్‌లో 20 నుంచి 22 మెట్రిక్ టన్నుల వరకు సరుకు రవాణా చేస్తున్నారు. ప్రత్యేక కారిడార్లు వస్తే ఒక్కో వ్యాగన్‌కు దాదాపుగా 25 మెట్రిక్ టన్నుల నుంచి 30 టన్నుల వరకు సరుకు రవాణా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యాగన్లను అందుబాటులోకి తేవడంతో పాటు వాటి సంఖ్యనూ భారీగా పెంచుతారు. ప్రయాణికుల రైళ్ల తరహాలోనే సరుకు రవాణా రైళ్లను కూడా టైం టేబుల్ ప్రకారం నడిపిస్తారు. ఫలితంగా రైల్వేల ఆదాయం సైతం భారీగా పెరగనుందని భావిస్తున్నారు.
డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ అంటే...
డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ (డీఎఫ్‌సీ) అనేది రైల్వే వ్యాగన్ల (గూడ్స్ రైలు) ద్వారా వేగంగా సరుకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక రైల్వే కారిడార్. ఇది అధిక సామర్థ్యంతో పాటు అత్యధిక వేగంతో సరుకు రవాణా చేసేందుకు ప్రత్యేకంగా నిర్మించే రైల్వే లైన్. ఈ లైన్‌లో కేవలం వ్యాగన్లు మాత్రమే తిరిగేందుకు అనుమతిస్తారు. ప్రయాణీకుల రైళ్లు ఈ కారిడార్‌లో తిరిగేందుకు అనుమతించరు. ఈ కారిడార్లను డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీ) సంస్థ పర్యవేక్షిస్తుంది.
యూపీఏ హయాంలో ప్రతిపాదన.. ఎన్డీఏ హయాంలో స్పీడ్ అప్..
రైల్వేలో సరైన యాజమాన్య పద్ధతులు లేక సరుకు రవాణాకు ఇబ్బం దులు ఏర్పడ్డాయని ఆ శాఖకు చెందిన వారే చెబుతు న్నారు. మౌలిక వసతులను పెంచుకునే విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోనేలేదు. ఫలితంగా గూడ్స్ ద్వారా ఆలస్యం అవుతుం దని చాలా మంది వ్యాపారులు రోడ్డు రవాణాకు మారారు. ప్రస్తుతం నిత్యం తిరుగుతున్న రైళ్ల ద్వారా వస్తున్న ఆదాయం కేవలం 20 శాతం మాత్రమే. ఎన్ని లోటుపాట్లున్నా కూడా ఇప్పటికీ సరుకు రవాణా ద్వారానే 75 శాతం ఆదాయం రైల్వేకు వస్తోంది. యూపీఏ హయాంలో ప్రతిపాదించినప్పటికీ... మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెడికేటెడ్ కారిడార్ల నిర్మాణం ఊపందుకుంది.
యూపీఏ ప్రభుత్వం 2013లో పనులు ప్రారంభించిన లూథియానా నుంచి ధన్‌కుని (కోల్‌కతా) వరకు 1,873 కి.మీ సరుకు రవానా ప్రత్యేక కారిడార్ పనులను ఎన్డీఏ సర్కారు పూర్తి చేసింది. ఫలితంగా బొగ్గు, ఫర్టిలైజర్, స్టీల్, ఐరన్ ఓర్ సహా ఇతర ఖనిజాలు, పలు రకాల సరుకులు అత్యంత వేగంగా రవాణా చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇక వెస్ట్రన్ కారిడార్ గ్రేటర్ నోయిడా లోని దాద్రి నుంచి ముంబై వరకు 1,504 కి.మీ. మేర చేపట్టిన పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇది పూర్తయితే తూర్పు, పశ్చిమ కారిడార్ల ద్వారా వేగం గా సరుకు రవాణా చేయడమే కాకుండా రైల్వే శాఖ ఆదాయం కూడా పొందేందుకు అవకాశం ఉంది. అందుకే ప్రభు త్వం ఈ రెండు ప్రాజెక్టుల కోసం రూ. 1.24 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
కేంద్ర మంత్రులదే బాధ్యత
దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో ముఖ్యమైన ప్రత్యేక రైల్వే కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా ఈ అంశాన్ని గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాస భూపతి, పెమ్మసాని చంద్రశేఖర్ ఐక్యంగా కేంద్ర రైల్వే మంత్రితో పాటు ప్రధాని మోదీ దృష్టికి తీసుకుపోతే సాధ్యమైనంత త్వరగా ఈ రైల్వే కారిడార్ వస్తుంది.
ప్రత్యేక కారిడార్ వస్తే అద్భుతమే
దేశంలో ఇప్పటికే ఈస్ట్, వెస్ట్ డీఎఫ్‌సీలను ప్రారంభించారు. ఫలి తంగా అక్కడ సరుకు రవాణా వేగం పెరగడమే కాకుండా అత్యధిక సామర్థ్యంతో వ్యాగన్లు పరుగులు పెట్టేం దుకు అవకాశం ఏర్పడింది. ప్రతిపాదిత సౌత్ కారిడార్ ఏర్పాటుతో చెన్నై నుంచి హైదరాబాద్, కాజీపేట మీదుగా ఢిల్లీకి సరుకు రవాణా మరింత వేగంగా జరుగుతుంది. మిగతా కారిడార్లతో అనుసంధానం చేయడంతో దేశమంతా సరుకు రవాణాకు ఆస్కారం ఏర్పడుతుంది. దక్షిణాది కారిడార్ ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు రైల్వేకు సైతం భారీగా ఆదాయం వస్తుంది. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు వల్ల రెగ్యులర్ రైళ్లు సమయానుకూలంగా తిరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలు ఆలస్యమై ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులు కొంతైనా తగ్గుతాయి.
సీహెచ్ శంకర్ రావు,
ప్రధాన కార్యదర్శి, ఎస్సీఆర్‌ఎంయూ






