రైతు భరోసాకు ఈసీ బ్రేక్
సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఈసీ ఆంక్షలు
13 తరువాత రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌కు ముందు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రైతు భరోసా డబ్బుల చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మే 13వ తేదీ పోలింగ్ ముగిసిన తరువాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఈసీ ఆదేశించింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్.వేణు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులపై రేవంత్ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదు పరిశీలించిన ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నెల 9వ తేదీలోగా రైతు భరోసా నిధులు జమచేస్తామని పలు సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించడంపై కోడ్ ఉల్లంఘన కింద భావించిన ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. కాగా, పంట పెట్టుబడి కింద అన్నదాతలకు అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధ మైంది. ఇప్పటివరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, ఐదు ఎకరాల పైబడిన రైతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించి రూ.2వేల కోట్లు నిధులు విడుదల చేసింది.
తప్పుపట్టిన ఈసీ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో రైతు భరోసాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని పేర్కొనడాన్ని తప్పు పట్టింది. ఎన్నికలు ముగిసిన తరువాత 5 ఎకరాలకు పైబడి భూమి ఉన్న 5.5లక్షల మంది రైతులకు నగదు పంపిణీ చేయాలని సూచించింది.




