మన నీళ్లపై బీజేపీ కన్ను
తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు కుట్ర, ప్రధానమంత్రి మోదీ చెప్పేవన్నీ గ్యాస్ మాటలే
అన్నదాతల ఉసురు పోసుకొంటున్న కాంగ్రెస్, ఐదు నెలల్లోనే పచ్చని తెలంగాణ ఆగమాగం
ఏ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలి, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
కామారెడ్డి/నిజామాబాద్/మెదక్, మే 7 (విజయక్రాంతి): కృష్ణా, గోదావరి నదుల్లోని తెలంగాణ నీటిపై బీజేపీ కన్ను పడిందని, మన నీటిని తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు కుట్రలు చేస్తున్న దని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. పదేండ్లలో ౧౫౦ హామీలిచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పచ్చని తెలంగాణను ఆగమాగం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మంగళవారం కామారెడ్డి, మెదక్ కార్నర్ సమావేశాల్లో మాట్లాడారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటున్న ప్రధాని సబ్ కా సత్తేనాష్ చేశారని మండిపడ్డారు. ‘బీజేపీ పాలనలో డాలర్‌కు రూపాయి విలువ రూ.84కు పడిపోయింది. ఎగుమతులు బంద్ అయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది.
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ బచావో, బేటీ పడావో నినాదాలకే పరిమితమయ్యాయి. జన్ ధన్ యోజన వల్ల ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు, రూ.30 లక్షలు వస్తాయన్నారు. కామారెడ్డి ప్రజలకు రూ.30 లక్షలు వచ్చాయా? రైతుల ఆదాయాన్ని మోదీ రెట్టింపు చేస్తానన్నారు. ఆదాయం రెట్టింపు అయ్యిందా? 150 వాగ్దానాలిచ్చిన మోదీ.. ఒక్కటి కూడా అమలుచేయలేదు. నవోదయ స్కూళ్లు, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. బీజేపీ ఎప్పుడూ దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీనే’ అని విమర్శించారు. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలుసుడేమో కానీ.. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను కచ్చితంగా లీటర్ రూ.400 చేస్తుందని అన్నారు. జహీరాబాద్, మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్, వెంకట్రామ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం
కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని, ఐదు నెలలకే ఆగమాగం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్ పెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నారా? రైతులకు కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తే, తాను రూ.౨ లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని చెప్పిండు. చేసిండా? కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కోతలు ఉండెనా? ఐదు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు పెట్టి పంటలు ఎండిపోయేలా చేసింది. ఇప్పుడు కరెంటు ఏమైంది? ఎక్కడికి పోతున్నది? మిషన్ భగీరథ నీరు వస్తుందా? నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? ధాన్యానికి రూ.౫౦౦ బోనస్ ఇస్తున్నారా? ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇచ్చారా? రూ.౨వేల పెన్షన్‌ను రూ.౪ వేలు చేస్తానని చేసిండా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 125 స్కూళ్లలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లోనే ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. పరిపాలనా సౌలభ్యం తాము జిల్లాలను విభజిస్తే.. వాటిని రద్దుచేస్తామని సీఎం రేవంత్ అంటున్నారని ధ్వజమెత్తారు.
పకోడిలు తిన్న కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలో ప్రచారం ముగించుకుని కామారెడ్డికి బయలుదేరిన కేసీఆర్.. మార్గమధ్యలో ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆగారు. అక్కడ పకోడీలు తిని, టీ తాగారు. ఈ సందర్భంగా ప్రజలు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు టోల్‌ప్లాజా వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, ఫారూఖ్, హేమలత, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మం త్ షిండే, దేశపతి శ్రీనివాస్, ముజీబుద్దిన్, పార్టీ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామ్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.




