31 July, 2026 | 3:50 PM

లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో సజ్జనార్ ప్రత్యేక పూజలు

31-07-2026 03:03 PM

హైదరాబాద్: లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో(Lal Darwaza Mahankali Temple) ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా బోనాల సందర్భంగా హైదరాబాద్ సీపీని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 

నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ లాల్‌దర్వాజా ఆలయ ఘనమైన చరిత్రను గుర్తు చేస్తూ.. గత 120 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని తెలిపారు. లాల్‌దర్వాజా బోనాలను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్‌అండ్ బి తదితర శాఖలతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని సజ్జనార్ వెల్లడించారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు జరగకుండా క్రైమ్ విభాగం, షీ టీమ్స్  ద్వారా 24 గంటలూ ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు.