31 July, 2026 | 3:48 AM

ఎగుమతులతోనే ఆర్థికాభివృద్ధి

31-07-2026 02:15 AM

సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : తెలంగాణను ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు అవసరమైన విధానాలు, సమస్యల పరిష్కారం, మౌలిక వసతులు, కొత్త మార్కెట్ల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పరిశ్రమలు, తయారీ యూనిట్లు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, హస్తకళలు, ఐటీ ఆధారిత సేవలు తదితర రంగాల ఎగుమతులను మరింత ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ఎగుమతుల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమివ్వడంతో పాటు తెలంగాణను దేశంలోని ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.1,22,655 కోట్ల విలువైన ఎగుమతులు నమోదైనట్లు వెల్లడించారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, వెజిటబుల్ సీడ్స్, రెడ్ చిల్లీ తదితర రంగాల్లో ఎగుమతులను గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయరు. ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు మరింతగా ఎగుమతి చేసేందుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారులతో సమన్వయం పెంపొందిం ఎగుమతుల వృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పర్యాటక, సంస్కృతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జీ.ముకుంద రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.