కోల్‌కతా డీసీపీ నివాసంలో ఈడీ సోదాలు
కోల్‌కతా, ఏప్రిల్ 19: కోల్‌కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) శంతన్ సిన్హా బిస్వాస్, వ్యాపారవేత్త సన్ ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ కామ్దార్లకు సంబంధించిన ఇళ్లు, ప్రాంగణాలపై ఈడీ ఆదివారం దాడులు చేసింది. వారం క్రితం, విశ్వజీత్ పొద్దార్ అలియాస్ సోనా పప్పుకు సంబంధించిన కేసులో హౌరా జాయింట్ కమిష నర్ గౌరవ్ లాల్, భూ మాఫియా కార్యకర్త జాయ్ కామ్దార్లకు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో టీఎంసీ నాయకులు కూడా విచారణలో ఉన్నారు. పలువు రు టీఎంసీ నాయకుల పాత్ర వెలుగులోకి వస్తోందని, దీంతో వారు విచారణకు లక్ష్యం గా మారారని వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈడీ కోల్‌కతాలోని ఎనిమిది ప్రాంతాల్లో సోదా లు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.1.47కోట్ల నగదు, సుమారు రూ.67.64 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఫార్చూనర్ కారు, రివాల్వర్‌లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వజీత్ పొద్దార్ వ్యవస్థీకృత నేరముఠాతో సంబంధాలు కొనసాగిస్తూ అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, అల్లర్లు సృష్టించడం వంటివి చేస్తుంటాడని ఈడీ పేర్కొంది.






