నేటి నుంచి విద్యావారోత్సవాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్
కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వారోత్సవాల కార్యాచరణను వివరించారు.ఈ ఏడు రోజుల పాటు నిర్వహించే విద్యా వారోత్సవాల షెడ్యూల్‌లో మొదటి రోజు విద్యా వారోత్సవాల ప్రారంభం,రెండవ రోజు విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన వసతులపై సమీక్ష, వేబినార్.మూడవ రోజు ట్రైనింగ్, ఓరియంటేషన్ కార్యక్రమం,నాల్గవ రోజు తల్లిదండ్రుల కమిటీల సమావేశం - విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చ.
ఐదవ రోజు లైబ్రరీ డే,ఆరవ రోజు డిజిటల్ విద్యపై అవగాహన సదస్సులు.ఏడవ రోజు ముగింపు వేడుకలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.






