ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్
దమ్మపేట,(విజయక్రాంతి): విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దమ్మపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు యుగంధర్ మాట్లాడుతూ... గత 12 ఏళ్లలో 157 పరీక్షల ప్రశ్న పత్రాల లీకులు, 86 కు పైగా పరీక్షలు రద్దయ్యాయన్నారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిందని, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. వీటితో అసంతృప్తి చెందిన విద్యార్థి, యువత ఈ తప్పులకు బాధ్యత వహించాలని,
విద్యా శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వారు కోరిన డిమాండ్లపై స్పందించడానికి బదులుగా, శాంతియుతంగా చేస్తున్న నిరసనను ఫాసిస్టు ప్రభుత్వం అతి పాశవికంగా హింసతో స్పందించిందన్నారు. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ షేల్స్, లాఠీ చార్జీలు ప్రయోగించి, విద్యార్థులను కొట్టి, లాగి, మహిళల దుస్తులు చింపి ఒక క్రూరమైన తొక్కిసిలాట పరిస్థితులను సృష్టించారన్నారు. ఈ ఫాసిస్టు చర్య తరువాత మనం వెనుకడుగు వేయకూడదని, విద్యార్థి, యువత కోరిన డిమాండ్లు నెరవేరే వరుకు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.






