25 June, 2026 | 1:32 AM

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

25-06-2026 12:00 AM

జైనూర్, జూన్ 24(విజయక్రాంతి): జైనూర్ మండల కేంద్రంలో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యాలయం, భవనాల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయంతో పాటు నిర్మించిన 12 గదుల భవనాలు కమిటీకి స్థిరమైన ఆదాయ వనరుగా మారుతాయని అన్నారు.

రైతులకు అవసరమైన సేవలు ఒకేచోట అందుబాటులోకి రావడంతో వ్యవసాయ కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా అసలు రసీదులు తీసుకుని భద్రపరచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందేందుకు మార్కెట్ యార్డులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు మార్కెట్ కమిటీని మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు.-

సమగ్ర ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. జైనూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశించా రు. సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.