నా జీతం.. వారి జీవితాల బాగుకోసం
- తల్లిదండ్రులు లేని ఇద్దరు విద్యార్థులకు అండగా..
- రూ.30 వేల ఆర్థికసాయం అందజేసిన అనంత్ రెడ్డి
కొండాపూర్, జూన్ 24 : ప్రజాప్రతినిధులు ప్రజాసేవకు అంకితమైతే సమాజం లో ఎంతటి మార్పు తీసుకురాగలరో గుంతపల్లి సర్పంచ్ పడమటి అనంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. తనకు వచ్చే గౌరవ వేతనాన్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొండాపూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన శృతి, శాంసన్ అనే ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులు మల్లేష్, సునీత మృతి చెందడంతో తాత నర్సయ్య, అమ్మమ్మ మాణెమ్మల సంరక్షణలో జీవిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి చదువులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గుంతపల్లి సర్పంచ్ పడమటి అనంత్ రెడ్డి మానవత్వంతో స్పందించి, తన గౌరవ వేతనం నుంచి రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని ఇద్దరు విద్యార్థుల చదువుల కోసం అందజేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అనంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘నా పదవీకాలంలో నాకు వచ్చే గౌరవ వేతనం మొత్తాన్ని నిరుపేద, అనాథ విద్యార్థుల విద్యాభివృద్ధికే వినియోగిస్తాను‘ అని ప్రకటించారు. ఆయన నిర్ణయం ప్రజాప్రతినిధుల్లో సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమ చదువులకు అండగా నిలిచిన సర్పంచ్కు విద్యార్థులు శృతి, శాంసన్, వారి తాత నర్సయ్య, అమ్మమ్మ మాణెమ్మ కృతజ్ఞతలు తెలిపారు.






