భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి
సిద్దిపేట సి పి సాధన రష్మీ పెరమాళ్
కొమురవెల్లి, మార్చి 18:తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ సమస్యలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సిద్దిపేట సిపి సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా, భక్తులకు శాంతిభద్రతలు కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేసినందుకుగాను ఆలయ వర్గాలు సిపిని కలిసి స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతర సమయంలో ట్రాఫిక్, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత సమస్యలతో ఇబ్బంది పడ్డట్లు తన దృష్టికి వచ్చిందని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి పోలీస్ శాఖ తరుపున సంబంధిత ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. వచ్చే సంవత్సరం జాతరను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి పోలీస్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సదానందం, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, పాలకమండలి సభ్యులు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, ఏఈఓ సుదర్శన్, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.




