16 April, 2026 | 1:25 PM

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి

16-04-2026 11:48 AM

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మంత్రాలయం(Mantralayam) మండలం చిలకలదోన గ్రామం సమీపంలో ఒక బొలెరో వాహనం, రెడీ-మిక్స్ లారీని ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షిగా గుర్తించారు.  ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 16 మంది భక్తులున్నారని బాధితులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఐదుగురు బాధితులు ఘటనా స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు యెమ్మిగనూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు యమ్మిగనూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఎన్. భార్గవి తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాకు చెందిన యాత్రికులని, శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వారు మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.