200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీపై హర్షం
- రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ నిరంతర సహకారం
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కాజీపేటలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ)కు రాబోయే 5 సంవత్సరాలలో 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను అప్పగించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ ఇంటర్ సిటీ రైళ్లు 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఈ రైళ్లు సుమారు 300 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాలలో ప్రయాణిస్తాయని, పట్టణాలు, నగరాల మధ్య ప్రజలు సులభంగా ప్రయాణించేలా సేవలందిస్తాయని తెలిపారు.
ప్రతి ట్రిప్‌లో అనేక స్టాప్‌లు ఉంటాయని, గంటకు 130 కిలోమీటర్ల వేగం వరకు ఇవి ప్రయాణిస్తాయని వెల్లడించారు. ఈ రైళ్లు తమ సమీప పట్టణాలలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు, తమ ఆరోగ్యం, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని కిషన్‌రెడ్డి తెలిపారు.






