calender_icon.png 28 January, 2026 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పనిసరిగా పాటించాలి

28-01-2026 02:04:00 PM

నేరాలకు పాల్పడ్డ, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారిపై నిఘా

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు 

జిల్లా ఎస్పీ  డి. జానకి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ  డి.జానకి  తెలిపారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సెక్షన్ 144 అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని ఆమె అన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct)ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అభ్యర్థులకు పోలీసుల సూచనలు అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలన్నారు. ఊరేగింపులు ఎన్నికల నిబంధనలకు లోబడి, ముందస్తు అనుమతితోనే నిర్వహించాలన్నారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, వాహనాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరని,వాహనాలపై రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ఒరిజినల్ కాపీతో పాటు వాహనం నంబర్, అభ్యర్థి పేరు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదని,నామినేషన్ సమర్పించేందుకు ఊరేగింపుతో వచ్చే అభ్యర్థుల అనుచరులు, మద్దతుదారులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతించబడతారన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుందని, జిల్లాలోని అన్ని పోలీస్ అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఎన్నికల ప్రక్రియ మొత్తం శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని కోరారు.