calender_icon.png 28 January, 2026 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి

28-01-2026 02:49:08 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయక్రాంతి): పవిత్ర ఏడుపాయల వన దుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పవిత్ర ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఘనంగా నిర్వహించాలని, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పార్కింగ్, విద్యుత్, తాగునీరు, బార్కెట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు, చిత్త సేకరణ, బ్లీచింగ్ పౌడర్ , దోమల నివారణకు ఫాగు లాంటివి ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. వివిధ సైన్ బోర్డులు, అంబులెన్స్, మందులు, అంటు వ్యాధులు రాకుండా చర్యలు, కోవిడ్ 19 కు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

రవాణా, బస్సులు, వాహనాలు, గజ ఈతగాళ్లు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్, వివిధ స్టాల్స్, పకడ్బందీగా దర్శనానికి క్యూలైన్ ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక యంత్రాలు, స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాల్స్ లను ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతరలో ఏ వస్తువులైన ఎక్కువ ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, జాతరలో అమ్మే తినుబండారాలలో ఎలాంటి రంగులు కలపకుండా చూడాలి.

జాతరలో 18 ఏళ్లు నిండని వారికి ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించరాదన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఏడుపాయలకు వెళ్లి శనివారం వరకు జాతరకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.