10-02-2026 12:00:00 AM
బంగ్లాదేశ్‌లో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తోంది. అయితే, ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ దేశంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢాకాలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు, నిరసనలు మిన్నంటుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా దేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సాఫీగా సాగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈసారి బంగ్లాదేశ్ ఎన్నికల ముఖ చిత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నది. సుదీర్ఘ కాలం పాలనలో ఉన్న షేక్ హసీనా పార్టీ ఆవామీ లీగ్‌ను మానవ హక్కుల ఉల్లంఘనలు, అల్లర్ల కారణంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా యూనస్ ప్రభుత్వం నిషేధం విధించింది.
దీంతో ఇప్పుడు ప్రధాన పోటీ తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), పాకిస్థాన్ బయటి నుంచి ఇస్తున్న మద్దతుతో బంగ్లాదేశ్‌లో చాన్నాళ్ల పాటు నిషేధిత పార్టీగా ఉన్న జమాతే ఇస్లామీ మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరికి తోడు విద్యార్థి ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఇస్లామిక్ రాడికల్ శక్తులు సహా ఇతర పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అంతర్జాతీయ పత్రికల తాజా సర్వేల ప్రకారం, ఈ ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఎందుకంటే అవామీ లీగ్ వంటి బలమైన ప్రత్యర్థి లేకపోవడం వీరికి కలిసొచ్చే అంశం. అయితే జమాతే ఇస్లా మీ పార్టీ కూడా సంస్థాగతంగా బలంగానే కనిపిస్తున్నది. అయితే ఈసారి ఎన్నికలకు దూరమైన ఆవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆదివారం బంగ్లాదేశ్ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయాలను వేడెక్కించింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను హసీనా ఒక నాటకంగా అభివర్ణించారు.
దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆవామీ లీగ్‌ను పోటీ చేయకుండా నిషేధించి నిర్వహిస్తున్న ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం ఏర్పడినా ఎక్కువకాలం కొనసాగదని హెచ్చరించడం కొసమెరుపు. ఇక బంగ్లాదేశ్‌లో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నా యి. శాంతి భద్రతలను కాపాడేందుకు దాదాపు 92,000 మంది సైనికులను యూనస్ ప్రభుత్వం మోహరించింది.
అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలపై రాజకీయ పార్టీల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల వేళ దేశంలోని మైనార్టీలైన హిందువులపై మరిన్ని దాడులు జరగవచ్చనే భయం నెలకొంది. గతంలో తమ స్వాతంత్య్రానికి అడ్డుపడిన పాకిస్థాన్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఎన్నోసార్లు ఆపన్నహస్తం అందించిన భారత్‌తో సఖ్యతను బంగ్లాదేశ్ క్రమంగా దూరం చేసుకుంటూ వస్తున్నది.
ఈ నెల 12న సార్వత్రిక ఎన్నికలను యూనస్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించి, ఎన్నికైన పార్టీకి అధికారాన్ని అప్పగిస్తేనే ఆ దేశంలో ప్రజాస్వామ్యం మళ్లీ ఊపిరి పోసుకునే అవకాశముంటుంది. అలా జరగకపోతే బంగ్లాలో అల్లర్లు ముదిరి దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేయడం ఖాయం.