01-10-2025 01:22:33 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల లో భాగంగా ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్ లతో కలిసి ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలు, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లా డుతూ జెడ్ పి టి సి, ఎం పి టి సి, సర్పంచ్, వార్డు సభ్యులకు నోటిఫికేషన్ వెలువడినందున అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. జిల్లాలో 15 జెడ్‌పిటిసి, 127 ఎంపిటిసి స్థానాలు, 335 గ్రామపంచాయతీ, 2 వేల 874 వార్డు సభ్యుల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కార్యచరణ విడుదల చేసిందని తెలిపారు.
ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను జిల్లాలో 2 విడతలు గా నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు. మొదటి విడతలో 8 మండలాలు, 2వ విడతలో 7 మండలాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జిల్లాలో 3 విడతలుగా ఎన్నికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యా హ్నం 1 గంట వరకు ఉంటుందని, మధ్యా హ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఉపసర్పంచ్ ఎన్నిక అదే రోజు జరుగుతుందని తెలిపారు.
ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి 2 అం చలుగా పోలీస్ భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని, సభలు, సమావేశాల కొరకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, సంబంధిత శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.