14-01-2026 02:23:26 AM
ముఖ్యమంత్రికి లేఖ
ముషీరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని, రాష్ట్రంలో యుద్దమే జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావనకు తీసుకురాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఈ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఇప్పటికి ఢిల్లీకి 64 సార్లు వెళ్లారు. ఒక్కసారి కూడా బీసీల గురించి ప్రధానమంత్రికి కలవలేదన్నారు.
కనీసం అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకు వెళ్లలేదన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు జరిపిస్తామని సీఎం అప్పట్లో చెప్పారని తెలిపారు. ఇప్పుడు మాట మార్చి మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 5,380 మంది బీసీ సర్పంచులతో జనవరి రెండో వారంలో బీసీ సర్పంచుల రాష్ట్ర ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.