స్తంభానికి కర్ర ఆధారం.. విరిగితే రైతులకు ప్రమాదం...
ఉట్నూర్, జులై 9 ( విజయక్రాంతి ): వ్యవసాయ భూములలో రైతులు త్రీఫేస్ విద్యుత్ సరఫరాతో పంటలు సాగు చేసే విధంగా ఆ శాఖ అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్న విషయాన్ని రైతులు గుర్తించి భూమిపై పడకుండా కర్రను ఆధారంగా ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ భూమిలో విద్యుత్ స్తంభాలను బిగించిన సమయంలో స్తంభాలు పడిపోకుండా కాంక్రీట్ ఇసుకతో స్తంభాల అడుగు భాగంలో బిగించవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లు విద్యుత్ శాఖ అధికారులతో కుమ్మక్కు కావడంతో వ్యవసాయ చేనులో ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలు ఈదురు గాలులకు, వర్షాలకు నేల పడుతున్నాయి. ఈ విషయాన్ని ఆ శాఖ అధికారులు గుర్తించిన మరమ్మత్తు చేసేందుకు అదనంగా నిధులు మంజూరు చేయించుకొని తాత్కాలికంగా స్తంభాలను మరమ్మత్తులు చేస్తున్నారు.
స్తంభాలు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే ఈదురు గాలులకు స్తంభాలు పడిపోవని రైతులు అంటున్నారు. ఇంద్రవెల్లి మండలం దొడందా పంచాయితీ పరిధిలోని వ్యవసాయ చేనులకు ఇటీవల విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. త్రీఫేస్ విద్యుత్ స్తంభాల ను ఏర్పాటు చేసే సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు స్తంభాలను భూమిలో బిగించిన సమయంలో కాంక్రీట్ ఇసుక సిమెంట్ కల్పి వేయకపోవడంతో ఇలా నేలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ చేనులో ఇట్టు వాళ్ళ కురిసిన ఈదురుగాల వర్షాలకు భూమిపై పడుతున్న విద్యుత్ స్తంభానికి పడిపోకుండా కర్రను ఏర్పాటు చేశారు. వ్యవసాయ చేనులో రైతులతో పాటు రైతు కూలీలు పనులు చేస్తున్న సమయంలో ఈదురు గాలులతో వర్షం కురిసి కర్ర విరిగితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని విద్యుత్ స్తంభాలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






