సమస్యల పరిష్కారానికి విద్యుత్ ప్రజావాణి
నిర్మల్ (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార ధ్యేయంగా ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం ప్రతి సోమవారం చేపడుతున్నామని నిర్మల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం(Circle Superintending Engineer Sudarshanam) స్పష్టం చేశారు. సోమవారం శాఖ కార్యాలయంలో వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు "విద్యుత్ ప్రజావాణి"లో 522 ఫిర్యాదులు రాగా, 521 పరిష్కరించామని తెలిపారు.
వినియోగదారుల విద్యుత్ సమస్యలు ప్రధానంగా విద్యుత్ బిల్లుల సమస్యలు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, క్యాటగిరి మార్పు, పేరు మార్పు ప్రమాద భరింతగా ఉన్న స్థంబాలు తదితర విద్యుత్ ఫిర్యాదుల సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి దోహదపడుతుందని తెలిపారు.
అలాగే వారితో సత్సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో అనగా సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో "ప్రతి సోమవారం "ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్ లో అదేరోజు సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. "విద్యుత్ ప్రజావాణి" వినియోగదారులకు మరింత చేరువలో అయ్యి వారితో మమేకమై ఉద్యోగస్తులు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని వివరించారు.






