ఉద్యోగ భద్రత కల్పించాలి
- పనికి తగ్గ వేతనం, అలవెన్సులు ఇవ్వాలి
- హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
- రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ కార్మికులు
- తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరాటం
- ఆర్టిజన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీష్‌రెడ్డి
మహబూబాబాద్/మెదక్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 20వేలకు పైగా ఆర్టిజన్, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ విద్యుత్ కార్మికులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని, ఇతర అలవెన్సులు కల్పించాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జెన్కో, ట్రాన్స్‌కో విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఎదుట, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సర్కిల్, డివిజన్ కార్యాలయాల ఎదుట విద్యుత్ కార్మికులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో అహర్నిశలు కృషి చేస్తుండగా గత ప్రభుత్వం తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని విద్యుత్ కార్మికులు ఆగ్రహించారు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చి ఇప్పటివరకు హామీని నెరవేర్చడం లేదని, చాలాకాలంగా తాము చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోవడంలేదని ఆగ్రహించారు. ఈనెల 17న సమ్మె నోటీసు ఇచ్చామని, అయినప్పటికీ తమ పట్ల సంస్థలు చిన్నచూపు చూడడంతో నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆర్టిజన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్ సతీష్‌రెడ్డి తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జెన్కో, ట్రాన్స్‌కో విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఎదుట, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సర్కిల్, డివిజన్ కార్యాల యాల ఎదుట విద్యుత్ కార్మికులు నిరవధిక సమ్మె నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు చర్చలకు పిలవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి సర్వీసును రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం సమ్మె లో సుమారు 16,000 మంది కార్మికులు పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. టీవీఏఈజేఏసీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం మెదక్ సర్కి ల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు భారీగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ డివిజన్ చైర్మన్ సీహెచ్ నాగరాజు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ బీఎన్ స్వామి, ఉపాధ్యక్షుడు పీ ప్రదీప్‌గౌడ్, కన్వీనర్ షాదుల్ హుస్సేన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, విద్యార్హతల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్‌ఈబీ నిబంధనలు అమలు చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో కార్యదర్శి పృథ్విరాజ్ గౌడ్, కార్యవర్గ సభ్యులు, జిల్లా, డివిజన్ నాయకులు చంద్రభాను, సురేష్, శ్రీశైలం, శరత్, మల్లేష్, జీ రవి, శ్రీనివాస్ తదితరులతో పాటు మొత్తం 246 మంది ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.




