4 July, 2026 | 2:27 PM

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

04-07-2026 01:43 PM

ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్

ముకరంపుర, జూలై 4(విజయ క్రాంతి): ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఉద్యోగులు ఎలాంటి అపోహలకు గురికావద్దని టీఎన్‌జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు.

ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న వైద్య సదుపాయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అందించాలని ఆలోచనలతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.పీఆర్సీ, డీఏల అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని,కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం  సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.

తెలంగాణలో అమలవుతున్న ఉద్యోగుల సంక్షేమ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మారం జగదీశ్వర్ పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు  పాల్గొన్నారు.