16 May, 2026 | 1:47 AM

జూన్ 2 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం

16-05-2026 12:22 AM
  1. తుది దశకు పీఆర్‌సీ అంశం, త్వరలో మరోసారి సమావేశం  
  2. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. జూన్ 2నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలు చేయనున్నామని, పీఆర్‌సీ అంశం కూడా తుది దశకు చేరిందని, నివేదిక తెప్పించుకొని త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో  సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. పీఆర్‌సీ నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జీఓ బదిలీలు, ఇతర అంశాలను సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిజిటల్ హెల్త్ కార్డుల జారీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల మూలవేతనంలో 1.5% చొప్పున వసూలు చేసి, ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్ అమలు చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగు లు, ఉపాధ్యాయుల పునరంకితం కావాలని, అందుకోసం మరింత నిబద్ధతతో పని చేయాలని సీఎస్ కోరారు.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకుని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచించినట్లు వెల్లడించారు.

సమావేశంలో స్సెషల్ సీఎస్ మహేశ్‌దత్ ఎక్కా, సవ్యసాచిఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తు, టీఎన్‌జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, జనరల్ సెక్రటరీ రామకృష్ణ, తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ పాక రమేష్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, కార్యదర్శి డి.భాస్కర్, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, కార్యదర్శి వి.భిక్షం, జీపీఓ అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు పాల్గొన్నారు. 

జూన్ 2లోపే హెల్త్ కార్డులు ఇవ్వండి: జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి 

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ జూన్ 2వ తేదీ లోపే హెల్త్ కార్డుల జారీతో పాటు పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్,  వి.లచ్చిరెడ్డి, జనరల్ సెక్రటరీ వొడ్నాల రాజశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వారు పలు సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ స్కీం ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని, రెవెన్యూ శాఖలో 61 ఏళ్ల వయసు పైబడిన వీఆర్‌ఏల స్థానంలో వారి కుమారులు, కుమార్తెలను నియమించాలన్నారు. 

రెవెన్యూలో తొలగించిన 632 కంప్యూటర్ ఆపరేటర్లు, ఎఫ్టీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ధరణి ఆపరేటర్లను కొనసాగించాలన్నారు.  సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులతో పాటు ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.