నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
సబ్ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పణ
నాగలిగిద్ద, ఏప్రిల్ 17: టీజీఈ జేఏసి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో లంచ్ అవర్స్లో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఉద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
జూన్ 2 వరకు నూతన పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను రెండు విడతల్లో చెల్లించాలని, మే 1 నుంచి హెల్త్ కార్డు అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలిసి సబ్ కలెక్టర్ ఉమాహారతికి, తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డికి టీజీఈ జెఎసి పక్షాన మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మన్మధ కిషోర్, పిఆర్టియు టీఎస్ నాయకులు శేరికర్ రమేష్, నాగనాథ్, రవీందర్ రావు, బస్వరాజ్ హల్లె, విజయందర్ రెడ్డి, ఎస్టియు నాయకులు కాశీరాం, రాజ్ కుమార్, టపాస్ సంఘం, యుటిఎఫ్, ఇతర ఉద్యోగ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






