కరకట్టతోనే వరద ముప్పునకు చెక్!
గ్రామసభలో ప్రజాభిప్రాయ సేకరణ..
శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్
బూర్గంపాడు, ఆగస్టు20,(విజయక్రాంతి): గోదావరి వరదల నుంచి మండల కేంద్రాన్ని కాపాడేందుకు ప్రతిపాదించిన కరకట్ట నిర్మాణంపై అధికారులు ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ మేరకు గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులో గ్రామసభ నిర్వహించి నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించారు. కరకట్ట నిర్మాణంతో వరద నీటి ప్రభావాన్ని తగ్గించి గ్రామాన్ని ముంపు నుంచి రక్షించవచ్చని అధికారులు తెలిపారు. గోదావరి వరదలు వచ్చిన ప్రతిసారీ బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో వరదల కారణంగా పంట పొలాలు, ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయని గుర్తుచేశారు. వరదల సమయంలో తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కరకట్ట నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి గ్రామానికి శాశ్వత రక్షణ కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామసభలో ప్రజలు తెలిపిన సూచనలు, అభిప్రాయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని కరకట్ట నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, సర్పంచ్ మంద మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, పంచాయతీ సెక్రటరీ సంపత్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






