22 April, 2026 | 12:02 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

పండ్ల తోటల పెంపకంతో ఉపాధి

01-07-2025 12:56 AM

-జిల్లాకు 700 ఎకరాల సాగు లక్ష్యం

-రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

-మూడేళ్ల వరకు ప్రభుత్వానిదే సంరక్షణ

సంగారెడ్డి, జూన్ ౩౦(విజయక్రాంతి): జిల్లాలో రైతులు పత్తి, సోయా, కంది వంటి సంప్రదాయ పంటలనే సాగు చేస్తున్నారు. అయితే వాటి దిగుబడులు ఆశించిన స్థాయిలో రాక పలువురు నష్టపోతున్నారు. ఈ క్రమంలో పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పండ్ల ఉత్పత్తి జరగక పోవడంతో భారీగా ధర పలుకుతున్నాయి.

ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం అన్నదాతకు ఆర్థిక చేయూత అందిస్తూ అండగా నిలుస్తోంది. రైతు నయాపైసా ఖర్చు లేకుండా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టే అవకాశం కల్పిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్ కు 700 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

సాగుకు ప్రభుత్వ చేయూత...

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలో ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 700 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలను పెంచేదిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు పండ్ల తోటల సాగుకు ప్రోత్సహిస్తుంది. ఎకరాకు 70 నుంచి 160 మొక్కల చొప్పున రైతులకు అందించనున్నారు. ప్రధానంగా మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, తైవాన్ జామ, మునగ, సీతాఫలం, సపోట, డ్రాగన్ ఫ్రూట్స్, కొబ్బరి తోటల పెంపకం చేపట్టేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జిల్లాలోని ఆసక్తి గల రైతుల నుంచి ఎంపీడీవోల ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపీడీవోల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా మొక్కలు అందించేలా చర్యలు చేపట్టనున్నారు. 

సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే...

పండ్ల తోటల పెంపకానికి సంబంధించి మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తవ్వేందుకు గుంతకు రూ.60 చొప్పున ఐదు గుంతలకు రూ.3000, మొక్కలు నాటేందుకు రూ.40 జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. అలాగే ఆ మొక్కలు ఎదిగేలా నీటిని అందించేందుకు సైతం ఆర్ధిక చేయూతనందిస్తుంది. రైతులు చేపట్టిన ఈ పండ్ల తోటలకు సంబంధించి ఒక ఎకరాకు మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే సంరక్షణ బాద్యతలను పర్యవేక్షిస్తూ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఐదెకరాల్లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. సదరు రైతులు సాగునీటి వసతి కలిగి ఉండాలి. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన డీఆర్డీఏ అధికారులు వ్యవసాయ, ఉద్యానవనశాఖల సమన్వయంతో దాన్ని అధిగమించేలా ముందుకు సాగుతున్నారు.