ఈఎంఆర్‌ఎస్‌ఎస్టీ ఆరో తరగతి ప్రవేశ ఫలితాలు విడుదల
నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం
గుండాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (ఈఎంఆర్‌ఎస్‌ఎస్టీ) ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిందని, ఎంపికైన విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఈఎంఆర్‌ఎస్ గుండాల ప్రిన్సిపాల్ నితిన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని, అందులో హాల్ టికెట్, ర్యాంక్ కార్డు/అలాట్మెంట్ కాపీ, స్టడీ కన్డక్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుండి జారీ చేసిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అభ్యర్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కులం, ఆదాయం, నివాస ధృవపత్రాలు, ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు ఇతర అవసరమైన పత్రాలు ఉన్నాయని, ఏవైనా పత్రాలు పెండింగ్లో ఉన్నట్లయితే ఎటువంటి సడలింపు ఇవ్వబడదని ఆయన స్పష్టం చేశారు.
అన్ని పత్రాలతో నిర్ణీత గడువులోపు అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని, అడ్మిషన్కు చివరి తేదీ 07 మే 2026గా నిర్ణయించబడిందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం తల్లిదండ్రులు మరియు విద్యార్థులు నేరుగా పాఠశాలను సంప్రదించవచ్చని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.






