రాష్ట్ర చరిత్రలోనే గరిష్ట స్థాయికి విద్యుత్ డిమాండ్
టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
జితేష్ వి పాటిల్
కల్వకుర్తి ఏప్రిల్ 28: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ 18 వేల మెగావాట్లకు చేరిందని టీజీఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కల్వకుర్తిలో పర్యటించారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్ కేంద్రం, 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 33/11 కెవి ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికులను సన్మానించారు.ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మరమ్మతులు, లోడ్ మేనేజ్మెంట్ చర్యల వల్లే ఈ స్థాయిలో సరఫరా సాధ్యమైందని ఆర్టిజన్ కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామన్నారు. విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఫీల్ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ఎక్కడైనా లోపాలుంటే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశమున్నప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వబోమని హామీ ఇచ్చారు. ఆపరేటర్లు, లైన్మెన్లే విద్యుత్ సంస్థకు నిజమైన బలమని ఎండ, వర్షం, రాత్రి, పగలు తేడా లేకుండా ఫీల్డ్లో పనిచేస్తూ ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. . వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.
విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
చారకొండ, ఏప్రిల్ 28: వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్తును అందిం చడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ సూచించారు. మంగళవారం చారకొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సబ్ స్టేషన్లలోని కరెంట్ సరఫరా తీరును పరిశీలించారు. కార్యాలయంలో మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ సమస్యలు ఉన్నాయా? సిబ్బందికి బాత్రూం వసతులు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకోవడం విశేషం.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను, విద్యుత్ సరఫరాలో ఉన్న వాస్తవ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడానికే ఈ పర్యటనలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ నరసింహారెడ్డి, డీఈ శ్రీధర్ శెట్టి, ఏడీఈ శంకరయ్య, ఏఈ లు మేఘనాథ్, శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ గోపాల్, లైన్ ఇన్స్ పెక్టర్ కస్న, బాలు, మహేష్, వెంకట్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






