21 April, 2026 | 1:44 PM

శత్రు దుర్భేద్యం.. మొలంగూర్

18-12-2024 12:00 AM

రాష్ట్రంలో ఎన్నో పురాతన కట్టడాలున్నాయి. వాటిలో శత్రు దుర్భేద్యమైన ఖిల్లాలు సైతం ఉన్నాయి. అలాంటి వాటిలో కరీంనగర్‌లోని మొలంగూర్ ఒకటి. ఈ ఖిల్లాలో అనేక ఆలయాలు, పురాతన కట్టడాలున్నాయి. ఈ ఖిల్లా లో అడుగుపెడితే ఆనాటి కాకతీయుల కట్టడాలు కళ్లముందు కదలాడుతాయి. 

కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి ఖిల్లా ఉంది. దీనినే మొలంగూర్ ఖిలంగూర్ పిలుస్తారు. ఈ ఖిల్లా చరిత్ర పరిశీలిస్తే.. గుట్టపై సుబేదార్ అనే వ్యక్తి కోట నిర్మించారని తెలుస్తోంది. గుట్టకింద దూద్‌బావి ఉండగా బావి నుంచి హైదరాబాద్ నిజాం నవాబుకు గుర్రాలపై నీటిని తీసుకెళ్లేవారట. గుట్టపై కోనేరు ఉండగా అందులో అన్ని కాలల్లో నీళ్లు నిల్వ ఉంటాయి.

13వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యాధికారి అలిగిరి మహరాజ్ అనే సంస్థానధీశుడు ఈ గుట్టను తన ఖిల్లా చేసుకొని ఇక్కడి నుండే ఓరుగల్లును పరిపాలించేవాడని చరిత్ర చెబుతుంది. సుబేదార్ అనే వ్యక్తి కోటపైకి వెళ్లడానికి వీలుగా రాతిబాటను కూడా నిర్మించారు. ఇక్కడ దూద్‌బావి, పురాతన శివాలయం, సెయింట్ మలాంగ్‌షా వలి సమాధి ఉంది. ఇక్కడి దూద్‌బావి నీటిలో గొప్ప ఔషధ విలువలు ఉంటాయి.

ఈ నీరు అనేక వ్యాధులను నయం చేస్తుందని భావిస్తారు. అయితే రాజు కోట ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంది. రాజుగారి కోట చుట్టు బురుజులు, ఫిరంగులు కనిపిస్తాయి. అయితే ఒంటరిగా కోటను ఎక్కడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే గుంపులు గుంపులుగా  చ్‌ంపులుగా ఎక్కుతారు. పూర్వపు పేరు ముదగర్ అని తెలుస్తుంది. కానీ కొండకింది భాగాన మంగ్ షా వలి సమాధి ఉండడంతో ఈ ఊరు కొంతకాలంపాటు మలంగూరుగా పిలవబడి అదే కాలక్రమంలో మొలంగూరుగా ప్రసిద్ధి పొందింది.

దాహం తీర్చే దూద్ బావి

దూద్ బావిని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించారు. ప్రతాపరుద్రుడి కోటకు ప్రవేశ ద్వారం దగ్గర ఈ బావిని ఏర్పాటు చేశారు. అయితే ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే చుట్టుపక్కల జలపాతాలు, నదులు ఏమీ లేవు. కానీ ఈ దూద్ బావిలోని నీరు మాత్రం తెల్లగా కనిపిస్తుంది. అందుకే ఈ బావికి దూద్ బావి అని పేరొచ్చింది. దూద్ అంటే పాలు అని అర్థం. ఆ బావిలోని నీళ్లకు ఆ రంగు రావడానికి కారణం ఏంటో కనిపెట్టేందుకు ఎంతోమంది ప్రయత్నించారు.

కానీ ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. స్థానిక ప్రజల ప్రకారం ఈ బావిలోని నీటిని తాగితే రోగాలు రాకుండా ఉంటాయని, ఎలాంటి రుగ్మతలైనా పోతాయని చెబుతారు. అయితే ఎంతవరకు నిజమో మాత్రం నిరూపణ కాలేదు. 

చారిత్రక సంపద..

మొలంగూర్ కోటని ప్రభుత్వ అధికారులెవరూ పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని, ఈ కోటను అభివృద్ధి చేసి సందర్శనాయోగ్యంగా మారిస్తే పూర్వ వైభవం సంతరించుకోవడమేగాక, చారిత్రక సంపదను కాపాడుకున్నవాళ్లమవుతాం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

దీని పైభాగాన ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేయడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతి శ్రావణ మాసంలో కొందరు భక్తులు అతి ప్రయాసతో కొండ ఎక్కుతుంటారు. కానీ కోటపైకి వెళ్లడానికి సరైన మెట్లు లేక, పూర్తిగా పైకి ఎక్కలేక మధ్యలోనే నిరాశగా వెనక్కి వెళ్లిపోతుంటారు.