శనిగరంలో కొత్త కాకతీయ శాసనం
పాతశనిగరంలో కొత్త కాకతీయ శాసనం లభించింది. ఈ శాస నం ఒక గ్రానైటు రాతిస్తంభం మీద మూడు వైపుల చెక్కివుంది. సూర్య, చంద్రులు, శివలింగం, ఆవులు శాసనం పైవైపు చెక్కివు న్నాయి. శాసనాన్ని చూసి రాసుకున్న దానిని బట్టి ఈ శాసనం రామనాథ దేవాలయానికి ఆ ఊరి ప్రజలు, మహాజనులు (బ్రాహ్మణు లు) సమక్షంలో కొన్ని మరుతురుల భూమి ని దానం చేసినట్టు వుంది. మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుని ఓరుగ ల్లులో రాజ్యం చేస్తున్నపుడు శక వర్షాలు (1)217, మన్మథనామ సంవత్సరం అంటే క్రీ.శ. 1295లో వేయబడిన శాసనమిది. ఇది వరంగల్లు జిల్లాలో దొరికిన కొత్త శాసనం.
పాత కరీంనగర్ జిల్లాలో చరిత్రలో ప్రసిద్ధమైన శనిగరం ఉంది. ఆ శనిగరం వేరు, ఈ శనిగరం వేరు. ఇపుడు కొత్త శనిగరం నగరం వెలుగులోనికి వచ్చింది. వరంగల్లుకు 20 కి.మీ.ల దూరంలో వరంగల్ అర్బన్ జిల్లా, కమలాపూర్ మండలానికి చెందిన గ్రామం శనిగరం. ఈ శనిగరం పురాతన శిథిల శివాలయం ఉంది. నిర్మాణశైలి ప్రకారం ఈ గుడి కాకతీయుల శైలికి చెందింది. నాలుగు అడుగుల ఎత్తున జగతిపై ఆలయ నిర్మాణం జరి గింది. 16 కాకతీయశైలి స్తం భాలతో కూడిన అర్ధమంట పం ఉంది.
అంతరాళం, గర్భగుడులున్నాయి. అంతరాళ ద్వారం ఉత్తరాశి మీద గజలక్ష్మి లలాటబింబంగా ఉంది. ద్వారస్తంభం మీద కలశాలు చెక్కివున్నాయి. గుడి కప్పుకు ప్రత్యేకమైన కాకతీయశైలి ప్రస్తరం (చూరు) కనిపిస్తుం ది. ఈ గుడిలోని స్తంభాలమీద చెక్కి న అర్థశిల్పాలు (ఎంబోజిం గ్) ప్రత్యేకం. ఇవి రామప్ప గుడిలోని స్తంభశిల్పాలకన్నా ముందరి కాలానికి చెందినవి.
విశేషమైన శిల్పం ఒక స్తంభం మీద కనిపించింది. ఈ స్తంభశిల్పంలో ఒకవైపు విల్లు ధరించిన చెంచులక్ష్మి కాలికి గుచ్చిన ముల్లు తీస్తున్న దృశ్యం, ఇంకోవైపు ఎద్దులతో రైతు కనిపించడం విశేషం. ఇది ఏరువాకకు చెంది న శిల్పమే. ఆమనగల్లు శాసన స్తంభంమీద నాగలి శిల్పం ఉంది. కొరివి, గొడిశాల శాసనాలు ఏరువాకను ప్రస్తావిస్తున్నాయి. ఈ స్తంభ శిల్పాలలో ఒక స్తంభంమీద ముగ్గురు నృత్యకారులు నాలుగు కాళ్ళతో కనిపించే శిల్పం రామప్పగుడిలోవలెనె ఉంది.
మరొక స్తంభంమీద ఏనుగులు తొం డాలతో కలెబడి, పోట్లాడుతున్న ట్టు శిల్పం. ఇంకో స్తంభం మీద హంసలున్నాయి. వైష్ణవమత ప్రతీకైన గండభేరుం డం, శైవమతంలో పేర్కొనబ డే శరభేశ్వరుల శిల్పాలను ఎదురు పడ్డట్టు చెక్కిన శిల్పం మరొక స్తంభం మీదున్నది. ఇతర స్తంభాలమీద మరిన్ని శిల్పాలున్నాయి. వాటిలో మణిపట్టికలతో అలంకరించబడిన స్తంభం ఉంది. ఒక స్తంభంమీద రెండు గుర్రాలమీద స్వారీచేస్తూ ఆయుధాలతో ఇద్దరు వీరులు కనిపిస్తున్నారు.
దేవాలయ స్తంభాలమీద యుద్ధ దృశ్యం చాలా అరుదైంది. రామాయణాన్ని తలపించే లేడివేట దృశ్యం.. విల్ల మ్ములతో వీరుడు, అమ్ముదిగిన జింక అగుపిస్తున్నాయి. వాద్యకారుల నడుమ నాట్యం చేస్తున్న నాట్యకత్తె. ఏనుగును వధిస్తున్న వీరుడు.
ఆలయ ప్రాంగణంలో హనుమంతుని శిల్పం, ఒక శాసనఫలకం ఉన్నాయి. ఇను ము చిట్టెం, పెద్ద ఇటుకలు కనిపించాయి. దేవాలయ ప్రాంగణంలో నాలుగువైపుల నాగశిల్పాలతో ఒకరాతి స్తంభం ఉంది. శాసనస్తంభంవంటి రాతికంభంమీద నాగశి ల్పా లు చెక్కివుండడం విశేషం. తలపగిలిన నంది, నంది అధిష్టానపీఠం ఆవరణలో ఉన్నాయి. అక్కడే ఉన్న హను మంతుని విగ్ర హం పాదాల కింద శాసనలిపి ఉంది. సింమ్వ సింగ్గన అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.
అది హనుమాన్ శిల్పాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరై ఉంటుంది. శనిగరంలో పాతశనిగరం, కొత్తశనిగరం అని పిలువబడే రెండు ప్రదేశాలు న్నాయి. కొత్తశనిగరంలో ప్రస్తుత గ్రామముంది. పాతశనిగరం పాటిగడ్డ. రెండు చోట్ల దేవాలయాలున్నాయి. కొత్త శనిగరంలో రెండు వరుసల గుడులున్నాయి. కుడివైపు గుడి శివాలయం. ద్వార స్తంభాల మీద శైవద్వార పాలకులు న్నారు. అంతరాళంలోనే గుండ్రని లింగపీఠం ఉంది.
గర్భగుడిలో మరొక పానవట్టంలో చిన్నలింగం ఉంది. గర్భగుడి ద్వారానికి కలశాలు న్నాయి. ద్వారబంధం ఉత్తరాశిమీద గజలక్ష్మి లలాటబింబంగా ఉంది. ఈ గుడికి బయట జాలకాలు కనిపిస్తున్నాయి. ఈ గుడికే పలుచని ఇటుకలతో కట్టిన వేసరశైలి గోపురం ఉంది. మరొకగుడికి వైష్ణవ ద్వారపాలకులున్నారు.
శనిగరంలో కొత్తశనిగరం, పాతశనిగరం రెండు వున్నాయి. పాతశనిగరంలో పాటిగడ్డమీద ఈ దేవాలయాలున్నాయి. దగ్గరలోనే ఉత్తరవాహినిగా వాగు ప్రవాహం ఉంది. ఇది మానేరు నదిలో కలుస్తుంది. అక్కడ కూడా చాళుక్యశైలి నిర్మాణవాస్తుతో కట్టిన గుడి ఆనవాళ్ళు, గుడిస్తంభాలున్నాయి.
-చారిత్రక వ్యాఖ్య:
శ్రీరామోజు హరగోపాల్, 9949498698,
కొత్త తెలంగాణ చరిత్ర బృందం
కన్వీనర్,
క్షేత్రపరిశీలన, ఫొటోగ్రఫీ:
దేవారం రమేశ్ శర్మ, ఉజ్జేతుల రాజు, శనిగరం, కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు






