ఇంగ్లాండ్ బతికిపోయింది
- ఓడినా వణికించిన నేపాల్
తృటిలో తప్పిన సంచలనం
ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు
ముంబై, ఫిబ్రవరి 8 : టీ ట్వంటీ ప్రపంచకప్‌లో తొలి సంచలనం కొద్దిలో తప్పిపో యింది. పసికూన అనుకుంటే కసికూనలో రెచ్చిపోయి ఆడిన నేపాల్ రెండుసార్లు వరల్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను దాదాపు ఓడించినంత పనిచేసింది. తమ మీద అంచనాలు లేకపోవడంతో దూకుడే మంత్రంగా ఆడిన నేపాల్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్క లు చూపించారు. వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న జోఫ్రా ఆర్చర్‌ను నేపాల్ బ్యాటర్లు ఉతికారేశారు. ఏదో గల్లీ బౌలర్‌ను బాదినట్టుగా ఆర్టర్ బౌ లింగ్‌లో సిక్సర్లు బాదేశారు.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో ఓడినా నేపాల్ ఇంగ్లీష్ టీమ్‌ను వణికించింది.
చివరి ఓవర్లో సామ్ కరన్ ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. లేకుంటే నేపాల్ సంచలనం సృష్టించి ఉం డేది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో నేపాల్‌పై గెలిచి బతికిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు నేపాల్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. 57 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియ న్‌కు పంపించారు. ఫిల్ సాల్ట్ (1), బాంటన్ (2), బట్లర్ (26) పరుగులకే ఔటయ్యారు.
ఈ దశలో జాకబ్ బెథల్, హ్యారీ బ్రూక్ జట్టు ను ఆదుకున్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. నాలుగో వికెట్‌కు 71 ప రుగులు జోడించారు. బెథల్ 55, బ్రూక్ 53 పరుగులకు ఔటైన తర్వాత చివర్లో విల్ జాక్స్ మెరుపులు మెరిపించాడు. కేవలం 18 బంతుల్లోనే 4 సిక్సర్లు, 1 ఫోర్ తో 39 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్ల లో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2, నందన్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.ఛేజింగ్ లో నేపాల్ కూడా ధీటుగా బదులిచ్చింది. పెద్ద గా అంచనాలు లేకపోవడంతో ఫియర్ లెస్ క్రికెట్ ఆడింది.
పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయినప్పటకీ 42 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత మరింత దూకుడుగా ఆడింది. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కెప్టెన్ రోహిత్ పాడెల్, దీపేంద్ర సింగ్ రెచ్చిపోయారు. వీరిద్దరూ 54 బంతుల్లోనే 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.వీరిద్దరూ క్రీజులో ఉండగా.. విజయం కోసం 36 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉం డగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
అయితే సామ్ కరన్ 15వ ఓవర్‌లో దీపేంద్రసింగ్ 44( 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో రోహిత్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. కానీ నేపాల్ అంత తేలిగ్గా మ్యా చ్‌ను వదల్లేదు. లోకేశ్ బమ్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 రన్స్ చేశాడు. ఆర్చర్ వేసిన ఓవర్లో 22 రన్స్, ల్యూక్ వుడ్ ఓవర్లో 14 పరుగులు రావడంతో ఉత్కంఠ తారాస్థాయి కి చేరింది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. కేవలం 5 పరుగులే ఇచ్చి ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. దీంతో నేపాల్ 180 పరుగులే చేయగలిగింది.




