9 July, 2026 | 2:34 AM

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు

09-07-2026 01:53 AM

కలెక్టర్ అంకిత్ 

సర్వే పూర్తయ్యాకే దరఖాస్తు ఫారాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి 

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి 

భద్రాద్రి కొత్తగూడెం/అన్నపురెడ్డిపల్లి, జులై 8, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం. 79 పరిధిలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించడంతో పాటు గుట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా పోలింగ్ స్టేషన్ నెం. 79ను పరిధిలో ఎస్‌ఐఆర్లో భాగంగా కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు.

ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, పూర్తి పారదర్శకతతో, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు జిల్లా కలెక్టర్కు ఎస్‌ఐఆర్ పురోగతిని వివరించారు. పోలింగ్ స్టేషన్ నెం. 79 పరిధిలో మొత్తం 1,012 దరఖాస్తు ఫారాల పంపిణీ పూర్తయిందని, ఇప్పటివరకు 128 ఫారాలను యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఫారాలను కూడా సర్వే పూర్తిచేసి, క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే యాప్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం గుట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు, హాజరు, విద్యాబోధన, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో మొత్తం 15 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు జిల్లా కలెక్టర్కు వివరించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్న తీరును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు, బూత్ లెవల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.