9 July, 2026 | 1:56 AM

సీజ్‌ఫైర్ ఖతం

09-07-2026 01:09 AM
  1. మళ్లీ ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం 
  2. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ 
  3. హోర్ముజ్ వద్ద నౌకలపై ఇరాన్ దాడులపై ఆగ్రహం 
  4. ఇరాన్‌లోని 80 లక్ష్యాలపై అమెరికన్ సైన్యం దాడులు 
  5. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్ 
  6. భగ్గుమన్న ముడిచమురు ధరలు 
  7. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

వాషింగ్టన్/టెహ్రాన్, జూలై ౮: అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్‌ఫైర్) ఇక ముగిసిందని, మళ్లీ దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తుర్కియేలోని అంకారా వేదిక బుధవా రం జరిగిన ‘నాటో’ శిఖరాగ్ర సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఇరాన్‌తో చర్చలు పెట్టే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇవాళో రేపో సీజ్‌ఫైర్ ఒప్పందం జరుగుతుందని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతాయని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్న వేళ ట్రంప్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నది.

మంగళవారం హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ సైన్యం మూడు వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడటం ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వెంటనే ఆయన అమెరికన్ సైన్యా న్ని రంగంలోకి దించి ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించారు. గురువారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖననం జరుగనున్న వేళ, ట్రంప్ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. నాటో సదస్సు వేదికగానే ట్రంప్ మరింత తీవ్రంగా ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

ఆ దేశ పాలకులు మోసగాళ్లని, దుర్మార్గులని మండి పడ్డారు. వాళ్లొక మానసిక రోగులని, సమాజానికి తెగులు లాంటి వారని అభివర్ణించారు. వారితో చర్చలు జరపడం సమయం వృథా అని వ్యాఖ్యానించారు. వారు శాంతి ఒప్పందానికి విలువ లేకుం డా చేశారని నిప్పులు చెరిగారు. వారితో అమెరికన్ ప్రతినిధులు చర్చలు జరపడం కూడా పనికిమాలిన పనేనని కొట్టి పడేశారు. ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే, ప్రస్తుతం తమముందున్న ఏకైక లక్ష్యమని పునరుద్ఘాటించారు.

అందుకు సైనిక చర్య తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుంటే, ఆ దేశం ఏ క్షణంలోనైనా పొరుగు రాష్ట్రాలపై వినియోగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఆర్థిక మూలమైన ఖార్గ్ ద్వీపాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

గత రాత్రి హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు చేశామని, అవసరమైతే మరోసారి కూడా అదే స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ ఒక చర్యకు పూనుకుంటే, ప్రతిచర్యగా అమెరికా ౨౦ రెట్ల బలంతో సమాధానం ఇస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే వేదికపై నాటో కూటమి దేశాలు అమెరికాకు తగినంత మద్దతు ఇవ్వడం లేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం కోసం చర్చలు జరిగితే జరగవచ్చని, వాటిని తాను అడ్డుకోబోనని పేర్కొన్నారు.

శక్తిమంతమైన దాడులు చేస్తాం..

అమెరికా, ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాకింగ్ హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రాత్రికి రాత్రే ఇరాన్‌పై శక్తిమంతమైన దాడులు చేస్తామని ప్రకటించారు. టర్కీ నాటో శిఖరాగ్ర సదస్సు వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీకి ముందు ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా, ఇరాన్‌కు అమెరికా ఇస్తున్న ఇదొక చిన్న హెచ్చరిక ఇస్తున్నామంటూ చమత్కరించారు. 

దాడులు.. ప్రతిదాడులు..

హోర్ముజ్ జలసంధి వద్ద మంగళవారం రాత్రి మార్షల్ ఐలాండ్స్, సౌదీ అరేబియా, లైబీరియాకు చెందిన నౌకలపై ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడిన నేపథ్యంలో అమెరికా భగ్గుమంది. అమెరికన్ సైన్యం బుధవారం ఇరాన్‌లోని ౮౦ లక్ష్యాలను టార్గెట్ చేసి వైమానిక దాడులకు పాల్పడింది. ఖార్గ్ ద్వీపం చమురు కేంద్రం, బందర్ అబ్బాస్, సిరిక్ ఒడరేవు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఎయిర్‌ఫోర్స్ రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేసింది.

సముద్ర తీరంలోని 60 చిన్న ట్రావెల్ బోట్లను ధ్వంసం చేసింది. అమెరికన్ దాడులకు ఇరాన్ సైతం స్పందించింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికన్ ఐదో నావిక దళ స్థావరాలను టార్గెట్ చేసి, ౮౫ క్షిపణులను ప్రయోగించింది. గురువారం ప్రతిష్ఠాత్మకంగా ఖమేనీ ఖననం జరుగనున్న వేళ, అమెరికా దాడులు ప్రారంభించడం ఇరాన్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.

ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికన్ సైన్యం ఇక విరుచుకుపడుతుందని అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇరాన్‌లోని విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరా కేంద్రాలను అమెరికా టార్గెట్ చేస్తుందనేది కథనాల సారాంశం. ఇరాన్ కూడా తనదైన శైలిలో స్పందించిది. తమ దేశంపై దాడులు చేసేందుకు అమెరికా సాయం అందించే దేశాలను విడిచిపెట్టేది లేదని గల్ఫ్ దేశాలకు హెచ్చరికలు చేసింది.