9 July, 2026 | 1:48 AM

కబ్జా గుప్పిట్లో ప్రభుత్వ భూములు?

09-07-2026 12:53 AM
  1. ఖాళీ స్థలం కనిపేస్తే ఖతమే..!
  2. నిద్రమత్తులో అధికారులు
  3. ప్రభుత్వ జాగలకు రక్షణ కరువు
  4. కన్నాలలో ఆగని భూకబ్జాల పర్వం

బెల్లంపల్లి, జూలై 8: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములకు రక్షణ పూర్తిగా కరువయ్యింది. భూకబ్జాలు చేయడాన్ని మించిన సులువైన పని మరోటి లేదన్నట్టుగా మారిపోయింది. ఇందుకు పట్టణంలో నిర్భయంగా జరుగుతోన్న ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమే పెద్ద ఉదాహరణ. పట్టణ శివారు పోచమ్మ స్మశాన వాటిక పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే పరిసరాల్లో ఉన్న ఖాళీ భూములన్నీ కబ్జాలకు గురికాగా అక్కడక్కడ మిగిలి ఉన్న ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి.

స్మశాన వాటిక ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న ఎకరానికిపైగా భూమిని ఆక్రమించుకొని చుట్టూ సిమెంట్ ఫోల్సు వేశారు. ఇంత కట్టుదిట్టంగా ప్రభుత్వ భూమి కబ్జా కావడం వెనుక పెద్దల ‘హస్తం’ ఉండటంతో అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు. అధికారులు ఉద్యోగ ధర్మంలో ఎంతో బిజీగా ఉండటం, వారికి కాసింత తీరిక లేకుండా ప్రజలకు సేవలు అందిస్తుండటం వల్లనే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై ఇంత ఉదాసీనంగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పాత్ర లేకుండా భూకబ్జాలు ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఆగని భూకబ్జాల పర్వం...

బెల్లంపల్లిలో భూకబ్జాల పర్వం నిరాటంకంగా సాగుతుంది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న కబ్జాకోరులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో భూకబ్జాలకు అస్సలు తెరపడటం లేదు. ప్రభుత్వ భూముల కబ్జాలకు అడ్డుకట్ట ఎవరి తరం కావడం లేదు... ఎంతో విలువైన ప్రభుత్వ భూముల్ని భూ బకాసురుల మింగేస్తుంటే ప్రభుత్వ అధికారులు వాటిని అడ్డుకోకుండా స్వాగతం పలినట్టుగా మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారులకు మరుగు మందు పెట్టినట్టు భూ కేటుగాళ్లు ఎక్కడ ఖాళీ స్థలం మిగలకుండా భోంచేస్తున్నారు.

ప్రభుత్వ భూములను వేలం వేసినట్టు కబ్జాకోరులు వశం చేసుకుంటున్నారు. పోచమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, గిరిజన యువజన నైపుణ్య శిక్షణ కేంద్రం మరికొద్ది దూరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దానికి సమీపంలో కేవీకే కేంద్రం, గురిజాలకు వెళ్లే దారి పొడవునా గురుకుల బాలురల ఆశ్రమ పాఠశాల, కేజీబీవి ఇలా ఆ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారిపోయింది. వీటివల్ల చుట్టు పక్కల ప్రభుత్వ భూములకు ఎనలేని విలువ.

అందుకే కబ్జాకోరులు ఎంత దొరికితే అంత అందిన కాడికి ఖాళీ భూములు కనిపిస్తే చాలు ఇట్టే ఆక్రమిస్తున్నారు. ముందుగా కొంతభాగమే ఆక్రమిస్తారు. అది పైకి మాత్రం అంత తీవ్రతగా కనిపించదు. ఎవరి దృష్టి పడకుండా ఇలాచేస్తారు. తరువాత దానికి అనుకుని ఉన్న ఖాళీ భూమినంత మెల్లగా తమ అధీనంలోకి తీసుకుంటారు. భూకబ్జాల పర్వంలో ఇలాంటి నయా దగా మోసాలతో కబ్జాదారులు ప్రభుత్వ భూములకు కన్నం వేస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టిపీడిస్తున్న కబ్జాల బెడుదను నివారించడంపై అధికారులు ఇప్పటికైనా తమ చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది.

రోడ్డు పక్కనే అక్రమ నిర్మాణం..

కన్నాల ప్రధాన మంచముఖి విగ్రహం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతుంది. కన్నాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆనుకొని ఉన్న స్థలంలో నిర్భయంగా అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. ఈ స్థలం బఫర్ జోన్ పరిధిలోకి వస్తోంది. ఇలాంటి స్థలాన్ని కూడా కబ్జాకోరులు వదలడం లేదు. పగలే నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో వ్యాపార సముదాయాల నిర్మాణాలు సాగుతుంటే రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు భగ్గుమంటున్నాయి.

ఇక్కడే కాదు కన్నాల శివారులోని ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఇరిగేషన్ సముదాయం పక్కన గల ప్రభుత్వ స్థలాలన్నీ చదును చేసి మరి ఆక్రమించారు. ఈ స్థలం మైనారిటీ పాఠశాలకు గతంలోనే కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ కబ్జా విషయంలో అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది అంతుపట్టడంలేదు. కబ్జారాయుళ్ళూ ఇలా ఎవరి బలం చూసుకుని రెచ్చిపోతున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. 

భూకబ్జాలకు కన్నాల శివారు కేరాఫ్ అయ్యింది. కబ్జాదారుల ఇష్టారాజ్యం, వారు ఏం చేసినా చెల్లుబాటే. ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణలతో సొంతం చేసుకోగా ఆక్రమణ భూముల్లో సెంటు భూమికూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారంటే.. భూకబ్జాల మూకల శక్తిసామ ర్థ్యాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

బడా నాయకుల కనుసన్నల్లోనే ఈ భూకబ్జాలు సాగుతున్నాయనడానికి ఇంతకంటే సాక్షి భూతం మరేమికావాలి. అనుమతితో కట్టిన నిర్మాణమే లేదంటే అతిశయోశక్తి కాదు.. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు కాజేస్తున్న భూమాపియా ఆగడాల తీరు అధికారులకు సవాల్ గా మారింది. నాయకుల, అధికారుల అండదండలతోనే భూ మాఫియా కబ్జాలు మూడు పూలు, అరుకాయలుగా సాగిస్తుందని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.