27 June, 2026 | 1:32 AM

ఆర్థిక భారంగా వినోదం

27-06-2026 12:00 AM

ఒకప్పుడు ఇంట్లో సినిమా చూడటమంటే దూరదర్శన్, కేబుల్ టీవీ దిక్కు. కేవలం రూ.100లోపు పేమెంట్‌తో ఒక కుటుంబం నెలంతా వినోదాన్ని ఆస్వాదించేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ లేకుండా ఏ పని జరగని పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ వ్యవస్థ ఈ అవకాశాన్ని వ్యాపారంగా మలుచుకుంది. ఇది సాధారణ ప్రజల జేబుపై భారీ భారం మోపుతోంది. నేడు సినిమా, వెబ్‌సిరీస్ లేదా క్రీడా ప్రసారాలు చూడాలంటే ఒక్క ఓటీటీ చందాతో సరిపోవడం లేదు.

సినిమా కోసం ఒకటి, క్రికెట్ కోసం మరొకటి, వెబ్ సిరీస్ కోసం ఇంకొకటి తీసుకోవాల్సి వస్తున్నది. ఇలా ఒక్కో ప్లాట్‌ఫాంకు ఒక్కో చందా చెల్లించాలి. వీటికి తోడు ఇంటర్నెట్ ఖర్చు తప్పనిసరి అవుతున్నది. కొన్ని టెలికాం సంస్థలు తమ బ్రాడ్‌బ్యాండ్ లేదా మొబైల్ ప్యాకేజీలతో ఓటీటీలను కలిపి ఉచితం అని ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఆ ఖర్చును వినియోగదారుడే భరిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలకు పైగా వినోదం కోసం ఖర్చవుతోంది. ఇది వినోదం కంటే ఆర్థిక భారంగా మారుతోంది.

డబ్బు చెల్లించి సభ్యత్వం తీసుకున్న తర్వాత కూడా ఓటీటీల్లో వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. రెండు నిమిషాల చొప్పున ప్రకటనలు ప్రసారం చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుడి అనుభవం దెబ్బతింటున్నది. థియేటర్లో సినిమా చూస్తే ప్రారంభమైన తర్వాత ప్రకటనలతో అంతరాయం ఉండదు. ఇంటర్వెల్ సమయంలో ప్రకటనలు వచ్చినా ఇబ్బంది అనిపించదు. ఇంట్లో డబ్బు చెల్లించి చూస్తున్నప్పుడు మాత్రం మధ్యలో వచ్చే ప్రకటనలు ప్రేక్షకుడిని విసిగిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు ముందుగా వినియోగదారుడిని తమ సేవలకు అలవాటు చేస్తాయి. తర్వాత నెమ్మదిగా ధరలు పెంచుతాయి. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు స్పందించాలి. ఓటీటీ ధరల విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. చెల్లింపు సభ్యత్వాల్లో ప్రకటనల పరిమితి, వినియోగదారుల హక్కులపై నియంత్రణ అవసరం. వినియోగదారులు కూడా ప్రతి కొత్త ప్లాట్‌ఫామ్‌కు సభ్యత్వం తీసుకోవడం తగ్గించాలి. అవసరం లేని ప్యాకేజీలకు డబ్బు చెల్లించడం వంటి అలవాట్లను పునఃపరిశీలించాలి. సాంకేతికత మన జీవితాన్ని సులభత చేయాలి. అంతేగానీ, వ్యసనంగా మార్చి ఆర్థికంగా బలహీనపరచకూడదు. వినోదం ప్రజల హక్కు. ఆ హక్కును కార్పొరేట్ కప్పంగా మార్చే ధోరణిని సమాజం ప్రశ్నించాలి.

 వీరప్ప, సీనియర్ జర్నలిస్టు