యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు!
మత్తుద్రవ్యాల వ్యాపారులు ఎక్కువగా యువతనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. స్నేహితుల ఒత్తిడి, చదువు లేదా ఉద్యోగ ఒత్తిడి వల్ల కొందరు యువకులు మత్తు పదార్థాల వైపు అడుగులు వేస్తున్నారు. తప్పుడు ఆకర్షణలు, సోషల్ మీడియా ప్రభావం కూడా ఇందుకు కారణమవుతున్నాయి. మొదట సరదాగా మొదలైన అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఇది వారి జీవితాలను నాశనం చేస్తుంది. వ్యసనం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.
చదువులో వెనుక బడటం, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ మద్దతు వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురాగలదు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి. పిల్లలతో భయపెట్టే విధంగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. పాఠశాలలు, కళాశాలలు కూడా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులకు కౌన్సిలింగ్, క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు వంటి సానుకూల అవకాశాలు అందించాలి. అక్రమ మాదకద్రవ్యాల రవాణాపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.
అదే సమయంలో వ్యసన బాధితులకు పునరావాసం కల్పించాలి. సరఫరాదారులపై కఠిన చట్టం, బాధితులపై మానవీయ దృక్పథం అవసరం. మత్తు లేని సమాజం నిర్మించడం ఒక్కరి బాధ్యత కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత కలిసి పనిచేయాలి. మీడియా, ప్రభుత్వం, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వాములు కావాలి. ఒక డ్రగ్స్ బాధితుడిని మామూలు మనిషిని చేయడం ముఖ్యం.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్






