సాహస మహా బైక్ యాత్ర
దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన మరణం వెనుక ఉన్న రహస్యాలు ఇప్పటికీ వీడలేదు. జపాన్‌లోని రేంకోజీ ఆలయంలో ఉన్న ఆయన అస్తికలను భారత్‌కు తీసుకువచ్చి, ఆయన కుమార్తెకు అప్పగించాలనేది కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. ఇదే డిమాండ్‌ను గుండెకు హత్తుకుని, దేశ ప్రజల్లో చైతన్యం నింపేందుకు వరంగల్‌కు చెందిన ఆడెపు కిశోర్ కుమార్ అనే యువకుడు అసాధారణమైన సాహస బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.
ఎలాంటి స్వార్థం లేకుండా, సొంత ఖర్చులతో వరంగల్ నేల నుంచి మొదలైన కిశోర్ బైక్ యాత్ర.. కన్యాకుమారిని తాకి, అక్కడి నుంచి హిమగిరుల కాశ్మీర్ వరకు సాగింది. ఈ నెల 9 న ఆయన తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని స్వస్థలమైన వరంగల్‌కు చేరుకున్నాడు. నమ్మిన సిద్ధాంతం కోసం కిశోర్ ఎంచుకున్న మార్గం సామాన్యమైనది కాదు. కేవలం ఒక బజాజ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్‌పై ఒంటరిగా ఆయన దాదాపు 13 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. భారతదేశంలోని 20కి పైగా రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగింది. ఈ ప్రయాణంలో ప్రకృతి ఆయనకు ఎన్నో సవాళ్లు విసిరింది. రాళ్లు పగిలే ఎండ తీవ్రత, తడిసిముద్దేసే వర్షాలు, రాత్రి వేళల్లో తీవ్రమైన చలి వీటన్నింటినీ కిశోర్ తట్టుకున్నాడు. దారిపొడవునా పార్కులు, షాపుల ముందు ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ హాళ్లే ఆయనకు ఆశ్రయమిచ్చాయి. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ, అలుపెరగని సూర్యుడిలా ఆయన ముందుకు సాగాడు.
భావితరాలకు నేతాజీ స్ఫూర్తి!
ఈ సుదీర్ఘ యాత్రలో కిశోర్ భారతదేశంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలను కళ్లారా చూశాడు. ఎక్కడికి వెళ్లినా స్థానిక ప్రజల ఆదరణ పొందాడు. ఉన్నత లక్ష్యం కోసం శ్రమిస్తున్నారంటూ కొనియాడారు. కేవలం ప్రయాణమే లక్ష్యంగా పెట్టుకోకుండా దారిపొడవునా ఉన్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను కలుసుకుంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన త్యాగాలను, ఆయన గొప్పతనాన్ని యువతకు, పాఠశాలల విద్యార్థులకు వివరించాడు. నేటి తరంలో దేశభక్తిని రగిలించేందుకు ఒక సంచార గ్రంథంలా మారారు.
నేతాజీ అస్తికలు భారత్‌కు తేవాలి!
నా స్వార్థం ఏమీ లేదు. నేతాజీ లాంటి మహానుభావుడికి దేశంలో సరైన గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని జపాన్లో ఉన్న ఆయన అస్తికలను వెంటనే భారతదేశానికి తీసుకురావాలి. నేతాజీ స్పూర్తి , భావజాలం దేశభక్తి భావి తరాలకు చాటిచెపేలా ఆయనకు సంబంధించిన ప్రత్యేక మ్యూజియం, పాఠ్యాంశాల, స్మృతి వనాలు, ప్రతి రాష్ట్ర రాజధానులు, ముఖ్య నగరాలు, జిల్లా కేంద్రాల్లో నెలకొల్పేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఆడెపు కిశోర్






