కశ్మీర్, హర్యానాకు ఎన్నికల నగారా
అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీ పోలింగ్
అదే నెల నాలుగో తేదీన ఫలితాల ప్రకటన
జమ్ముకశ్మీర్‌లో మూడుదశల్లో పోలింగ్
సెప్టెంబర్ 18న మొదటి విడుత ఓట్లు
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ, ఆగస్టు 16: లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికల సమరానికి శుక్రవారం తెరలేచింది. హర్యానా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఈ రెండు చోట్ల వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. హర్యానా అసెంబ్లీ గడువు కూడా నవంబర్‌లో ముగుస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు చోట్ల ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 4వ తేదీనే ప్రకటిస్తారు.
దేశంలో ఇటీవల నిర్వహించిన లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతి భారీ ప్రజాస్వామిక ప్రక్రియ అని సీఈసీ రాజీవ్‌కుమర్ తెలిపారు. ‘2024 లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియ. ఈ ఎన్నికలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించాం. మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఈ ఎన్నికలు బలోపేతం చేశాయి. దేశం మొత్తం ఎన్నికల పండుగ చేసుకొన్నది. ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాం’ అని వివరించారు.
హర్యానాలో ఈసారైనా ఫలితం తేలేనా?
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర ఆశాభంగం కలగటంతో ఇప్పుడు ఆ రాష్ట్రం అధికారంలో ఉన్న హర్యానా ఎన్నికలపై అందరి దృష్టి పడిం ఈ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 40 చోట్ల, కాంగ్రెస్ 31 సీట్లు గెలిచాయి. జననాయక్ జనతాపార్టీ 10 సీట్లు గెలిచి కింగ్ మేకర్‌గా అవతరించింది. ఇతరులు 9 చోట్ల గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు.
జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రధాని మోదీ స్నేహితుడు మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వానికి జేజేపీ మద్దతు ఉపసంహరించుకొంటున్నట్టు ప్రకటించినా అసెంబ్లీలో బల నిరూపణ జరుగలేదు. ఈసారైనా ప్రజలు ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటి ఎన్నికలు
జమ్ముకశ్మీర్ అసెంబీలో కూడా 90 సీట్లు ఉన్నాయి. 2019కి ముందు జమ్ముకశ్మీర్ రాష్ట్రంగా ఉండేది. ఆ ఏడాది ఆగస్టులో ఈ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యంగ ఆర్టికల్ 370ని మోదీ సర్కారు రద్దుచేసింది. రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్ముకశ్మీర్‌తోపాటు లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనే కొనసాగుతున్నది. 2014 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. 2018లో ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావటంతో అసెంబ్లీని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించారు.
లాపతా జెంటిల్‌మెన్
ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తోటి ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్‌సింగ్‌ను మీడియాకు పరిచయం చేసిన ఆయన ముగ్గురు జెంటిల్‌మెన్‌లు వచ్చారు అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కొందరు నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా ఈసీ నిర్లిప్తంగా ఉన్నదనే విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ‘లాపతా లేడీస్’ పేరుతో సోషల్‌మీడియాలో ఈసీపై సెటైర్లు పేలాయి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజీవ్‌కుమర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో ఇప్పుడే కాదు
హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. అత్యంత కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం షెడ్యూల్ ఇవ్వలేదు. 2019లో ఈ మూడు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఈసారి మహారాష్ట్ర ఎన్నికలను ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న ప్రశ్నకు సీఈసీ భద్రతా కారణాలను చూపారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు ముందుగా అనుకున్నదానికంటే ఎక్కువ బలగాలు అవసరం పడుతున్నాయని, అందుకే మహారాష్ట్రలో దళాల కొరత కారణంగా ఎన్నికలు వాయిదా వేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా తుది ఓటర్ లిస్టు సిద్ధం కాలేదని చెప్పారు. రాహుల్‌గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికపైనా ఈసీ నిర్ణయం ప్రకటించలేదు.
హర్యానా ఎన్నికల షెడ్యూల్
మొత్తం అసెంబ్లీ సీట్లు 90
ఎన్నికల నోటిఫికేషన్ జారీ సెప్టెంబర్ 5
నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 12
నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ 16
పోలింగ్ అక్టోబర్ 1
ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4
జమ్ముకశ్మీర్ ఎన్నికల షెడ్యూల్
మొత్తం అసెంబ్లీ స్థానాలు 90
మొదటి దశ
పోలింగ్ జరిగే స్థానానాలు 24
నోటిఫికేషన్ జారీ ఆగస్టు 20
నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 27
నామినేషన్ల పరిశీలన ఆగస్టు 28
నామినేషన్ల ఉపసంహరణ ఆగస్టు 30
పోలింగ్ సెప్టెంబర్ 18
ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4
రెండోదశ
పోలింగ్ జరిగే స్థానానాలు - 26
నోటిఫికేషన్ జారీ ఆగస్టు 29
నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 5
నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 6
నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ 9
పోలింగ్ సెప్టెంబర్ 25
ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4
మూడో దశ
పోలింగ్ జరిగే స్థానానాలు 40
నోటిఫికేషన్ జారీ సెప్టెంబర్ 5
నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 12
నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ 17
పోలింగ్ అక్టోబర్ 1
ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4




