calender_icon.png 20 February, 2026 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరుకుల యానాదుల ఎరుక కేశవరెడ్డి

16-02-2026 12:00:00 AM

‘స్వీయానుభూతిలో ఉన్నంత తీవ్రత సహానుభూతిలో ఉండకపోవచ్చు.. అయితే దళితేతరులు కూడా దళితుల జీవితాలను బాగా అర్థం చేసుకుని రాయవచ్చు. నాకు దళితుల సమస్య బాగా తెలుసు. పుట్టుకతో దళితులైన వారికంటే ఎక్కువ ఆర్ద్రతతో, ప్రత్యేక చొరవ తీసుకుని నేను వాళ్ల గురించి రాయగలిగాను’ అని చాటిచెప్పిన నవలాకారుడు డాక్టర్ కేశవరెడ్డి. తెలుగు సాహిత్యరంగంలో ఆయనకొక అరుదైన సృజనకారుడు.

అణగారినవర్గాలైన ఎరుకలు, యానాదులు, దళితుల జీవితాలను కావ్య గౌరవంతో చిత్రించిన మహనీయుడు. రచయితగా ఆయన ఏ వాదాలకో, ఉద్యమాలకో పరిమితం కాలేదు. తనకంటూ ఒక ప్రత్యేక పాఠక వర్గాన్ని సృష్టించుకున్నారు. ఆయన స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా అయినప్పటికీ, వృత్తి రీత్యా తెలంగాణలోనే స్థిరపడ్డారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి డిస్పెన్సరీలో సుదీర్ఘకాలం పాటు వైద్యుడిగా సేవలందించారు.

పేదల డాక్టర్‌గా పేర్గాంచారు. ఈ క్రమంలో ఎందరో కుష్ఠు బాధితులకు సేవలందించి మానవతా విలువలను చాటారు. ఇది ఒకవైపు అయితే.. రచనా వ్యాసాంగం ఆయనలోని మరో కోణం. ఆయన అచ్చంగా పేద ప్రజల పక్షాన నిలబడిన నవలా రచయిత. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అనాది నుంచి ఆధిపత్య కులాలతో అణచబడుతున్న కులాల ఈతిబాధలను నవలీకరించారు. సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను, ఆర్థిక అసమానతలను తన రచనల ద్వారా బట్టబయలు చేశారు. ‘శ్మశానం దున్నేరు’ నవలలో దళిత ఉపకులాల మధ్య ఉండే సంఘర్షణలను చిత్రీకరించారు.

వర్ణ వ్యవస్థలోని క్రూరత్వాన్ని ఎండగట్టారు. ‘ఇన్‌క్రిడిబుల్ గాడెస్’ నవలలో అణచివేత ఏ ప్రాంతంలోనైనా ఒకేలా ఉంటుందని పాత్రల చిత్రణ ద్వారా నిరూపించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల దైన్యాన్ని తాత్త్విక కోణంలో పాఠకుల ముందుకు తెచ్చారు. చలం తర్వాత తెలుగు వచనంలో అంతటి సంచలనం సృష్టించిన ఘనత కేశవరెడ్డికే దక్కుతుంది. స్త్రీలు, పీడితుల పట్ల ఆయనకు ఉన్న సంవేదన ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది.

మ్యాజికల్ రియలిజం.. నవలల్లోని మ్యాజిక్

కేశవరెడ్డి ప్రవేశపెట్టిన సాహిత్య రీతులు విలక్షణమైనవి. ఆయన నవలల్లో మ్యాజికల్ రియలిజం (మాంత్రిక వాస్తవికత) ఛాయలు కనిపిస్తాయి. ‘అతడు అడవిని జయించాడు’ నవలలో ఒక ముసలివాడు నక్కలతో, ప్రకృతితో జరిపే జీవన పోరాట చిత్రణ అద్భుతంగా ఉంటుంది. ప్రాణానికి ప్రాణమైన పందిని తానే చంపుకోవాల్సిన నిస్సహాయ స్థితిని రచయిత ఎంతో తార్కికంగా చిత్రించారు. అలాగే ‘మునెమ్మ’ నవలలో కూడా ఈ మాంత్రిక వాస్తవికత మనకు దర్శనమిస్తుంది. ఇవి కేవలం పాశ్చాత్య అనుకరణలు కావు. భారతీయ జానపద సంప్రదాయంలోని వీరగాథా కథన పద్ధతిని ఆయన స్వీకరించారు.

‘మూగవాని పిల్లనగ్రోవి’ నవలలో బక్కిరెడ్డి మరణాన్ని పంచభూతాలు ఆవాహన చేసుకోవడం ఈ శైలికి అద్దం పడుతుంది. ఆయన వైద్య విద్యార్థుల జీవితాలనూ అద్భుతంగా చిత్రీకరించారు. ‘సిటీ బ్యూటీఫుల్’ నవలలో మెడికోల మనస్తత్వాలను, వారి అంతర్మథనాన్ని సహజంగా చూపించారు. ఆయన తన నవలల్లో సృష్టించిన మన్నుగాడు, రంపాల రామచంద్రుడు, అర్జునుడు వంటి పాత్రలు వ్యవస్థ విధించే కట్టుబాట్లను నిష్కర్షగా ధిక్కరిస్తాయి. ఆత్మాభిమానంతో బతకడం కోసం అవి చేసే పోరాటం పాఠకులలో స్వేచ్ఛాకాంక్షను కలిగిస్తుంది.

ఇతివృత్తం ఎంత క్లిష్టంగా ఉన్నా దానిని పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనది అందెవేసిన చేయి. రచయితగా ఎంతో కీర్తి ఉన్నా ఆయన జీవితకాలం నిరాడంబరంగా జీవించారు. తన రచనల గురించి తాను గంభీరంగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడేవారు కాదు. కానీ, ఎదుటివారు చెప్పే విషయాలను మాత్రం ఎంతో ఓపికగా వినేవారు. సమాజంలోని అన్ని రుగ్మతలకు ఆర్థిక అసమానతలే మూలకారణమని ఆయన గట్టిగా నమ్మారు. వర్గ పోరాటమే దీనికి అంతిమ పరిష్కారమని తన పీఠికల్లో పేర్కొన్నారు.

తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిస్వార్థంగా పేదలకు వైద్యం చేస్తూనే, మరోవైపు అదే సంకల్పంతో అక్షర సేద్యమూ చేశారు. ఆయన నవలలు చదువుతుంటే మనల్ని మనం ప్రక్షాళన చేసుకున్నంత అనుభూతి కలుగుతుంది. ఆయన రచనలు రానున్న తరం రచయితలకు ఒక మార్గదర్శకాలుగా నిలుస్తాయి. సామాజిక సమస్యలు లోతుగా తెలిసిన వాళ్లందరూ, నవలలు, కథలు రాయలేకపోవచ్చు కానీ, వారి తరఫున బాధ్యతగా రాయడం ఎలాగో.. కేశవరెడ్డి తన రచనల ద్వారా చాటారు.

ఈ అరుదైన సాహితీమూర్తి 2015 ఫిబ్రవరి 13న కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నవలలు సమాజ మార్పు కోసం తపించే ప్రతి ఒక్కరిలో నిరంతరం స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి.