25 February, 2026 | 8:38 PM

ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

25-02-2026 06:59 PM

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, మందుల సరఫరా, వైద్య సేవల పరిస్థితిని ఎంపీ స్వయంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.వరంగల్ జిల్లాకు త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం వంటి మూడు ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

ఈ కారణంగా చికిత్స కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి సౌకర్యాలను ఇప్పటినుంచే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసినట్లు ఎంపీ వెల్లడించారు.అనంతరం ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశమై ఆసుపత్రి నిర్వహణ, సౌకర్యాల లోటుపాట్లు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యుల ఖాళీల భర్తీ, మందుల కొరత, శానిటేషన్ పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

ఆసుపత్రికి అవసరమైన నిధులు, వసతులు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు జంగిల్ క్లియరెన్స్ చేపట్టి తక్షణమే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ బి. సాంబశివరావు, ఆసుపత్రి సివిల్ సర్జన్స్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ అశోక్, డాక్టర్ రామచంద్ర, ఆర్ఎంఓ డాక్టర్ యుగేందర్ ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.