17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఈటల, హరీశ్‌రావు రహస్య భేటీ

31-05-2025 02:44 AM
  1. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్‌కాల్
  2. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులతో మళ్లీ చిగురించిన బంధం
  3. త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం
  4. విలీనం బలపరిచేలా ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
  5. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వగానే తిరిగి మాజీ సీఎం కేసీఆర్, నాటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మధ్య మళ్లీ బంధం చిగురించింది. నాటి ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిలో భాగంగానే శామీర్‌పేటలోని ఫాంహౌస్‌లో ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి వారు ఘోష్ కమిషన్ నోటీసుల గురించి కేసీఆర్‌తో ఫోన్‌లో సంభాషించారు’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఒక మునిగిపోయే నావ అని, ఇక ఆ నావలో మిగిలిన వస్తువులు, సొమ్ము కోసం పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో కొట్లాటలు మొదలయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీతో కలవడం వల్లే ఆ పార్టీ ఎనిమిది ఎంపీ స్థానాల్లో విజయం సాధించగలిగిందని అభిప్రాయపడ్డారు. ‘మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నేతలు కూడా పార్టీని వీడుతారు’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించాలని సవాల్ విసిరారు.

కిషన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలపై సమాధానం చెప్పకుండా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడం చేతగానితనమని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను పోల్చి చూస్తే త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయని వెల్లడించారు. వారిద్దరి వ్యాఖ్యలతో ముడుపుల బాగోతం,  బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం బయటపడిందన్నారు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైనికులకు బాసటగా నిలిస్తే.. బీజేపీ నేతలు ఆయనపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాకిస్థాన్‌తో మోదీ ప్రభుత్వం యుద్ధం చేయలేకపోయిందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారని వ్యాఖ్యానించారు. ‘భారత్ ఇటీవల పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధంలో సాధించిందేంటి ? కోల్పోయిందేంటి;’ అనే అంశాలపై ప్రధాని మోదీ దేశప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నాటి ప్రధాని ఇందిరాగాంధీని ‘అపర ఖాళీ మాత’ అని నాడు బీజేపీ అగ్రనేత అటల్ వాజపేయి కొనియాడిన విషయం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలియకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలో వందలాది సర్జికల్ స్ట్రుక్స్ జరిగాయని గుర్తుచేశారు. బీజేపీ మాత్రం సైనిక రహస్యాలను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నదని ఆరోపించారు.