మండుటెండలో మరింత కష్టం!
మాడు పగులుతున్నా మారని విధానాలు
ఫోటో క్యాప్చర్‌లో ముఖ గుర్తింపు కష్టంగా మారిన వైనం
సర్వర్ పనిచేయక, సిగ్నల్ రాక పెరుగుతున్న ఉపాధి కష్టాలు
సాంకేతిక కష్టాలకు తెరదించాలని ఉపాధి కూలీల వేడుకోలు
మఠంపల్లి, జూన్ 5: మండలంలో దంచి కొడుతున్న ఎండలు ఉపాధి కూలీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు, రక్షణ ఏర్పాట్లు కరువువడంతో ఇబ్బందిపడుతున్నారు. తాగేందుకు నీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండక అవస్థలు పడుతున్నారు.
దీంతో పాటు ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు డబ్బులు ఎప్పుడు అందుతాయో తెలియక, బ్యాంకుల్లో ఈ-కేవైసి కాకపోవడంతో డబ్బులు జమ కాక సతమతమవుతు న్నారు. వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యంతో జాబ్ కార్డులున్నా పనులకు వచ్చేందుకు కూలీలు సుముఖత చూపడం లేదు.
ఇక ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులు కూలీలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. ఈ కేవైసీ చేసుకుంటేనే హాజరు నమోదవడం, ఫొటో క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానం లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నా యి. గ్రామాల్లో ఉపాధి కూలీలు ఉదయం 5:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి సుమారు ౩ నుంచి ౫ కిలోమీటర్లు నడుచుకుం టూ పని ప్రదేశానికి వెళ్ళి పనిచేయాల్సి వస్తుండడంతో కష్టాలు పడాల్సి వస్తుంది.
ఫోటో క్యాప్చరింగ్‌లో కష్టంగా మారిన ముఖ గుర్తింపు:
ఉపాధి పనులు మొదలు పెట్టే ముందు గ్రూపులోని కూలీలకు ఫొటో క్యాప్చరింగ్ తో అటెండెన్స్ వేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా, గ్రూపులో అప్పుడప్పుడు ఒక్కరు లేదా ఇద్దరి కనులు క్యాప్చర్ కాక వారు పని చేయకుండానే నిరాశతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ముఖ్యంగా గుండు చేయించుకున్న కూలీలను యాప్ గుర్తించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫొటో అటెండెన్స్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
సర్వర్ పనిచేయక, సిగ్నల్ అందక!
సర్వర్ సమస్యతో కూలీల ముఖ కవళికల గుర్తింపు నమోదు కాకపోవడంతో పని కోసం వచ్చిన కొందరు తిరిగి ఇండ్లకు వెళ్తున్నారు. హాజరు నమోదుకు ఫొటోలు తీసే సమయంలో సిగ్నల్ లేక సర్వర్ పనిచేయడం లేదని గంటలు తరబడి ఎండల్లో నిలబడాల్సి వస్తుందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మండలంలోని కొన్ని గ్రామాల్లో చేపట్టిన పనుల కొలతల్లో తేడాల వల్ల, చెల్లించాల్సిన డబ్బుల్లో తేడాలు రావడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉపాధి పనులు చేస్తున్నారు. పని ప్రదేశంలో మజ్జిగ, నీళ్లు అందుబాటులో ఉండకపోగా కనీసం నీడ కోసం టెంట్లు కూడా వేయడం లేదనీ కూలీలే చెబుతున్నారు. గత్యంతరం లేక ఇండ్ల నుంచే పని ప్రదేశాలకు కూలీలు తాగునీరు తెచ్చుకుంటున్నారు. కూలీలకు అందించే మజ్జిగ ప్యాకెట్ల పంపిణీపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయిస్తున్న ఫిల్ అసిస్టెంట్లు ఉపాధి కూలీల ఒత్తిడితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మొత్తానికి ఎద వేడిమికి మాడు పగులుతున్నా ఉపాధి కష్టాలు మాత్రం కూలీలకు తప్పడం లేదని పలువురు అంటున్నారు. పాత పద్ధతిలో ఉపాది పనులు జరిగినా ఇన్ని కష్టాలు ఉండేవి కాదని కూలీల చెబుతున్నారు. ఇప్పటికయినా అధికారులు స్పందించి పని ప్రదేశంలో కనీస సదుపాయాలు కల్పించి కూలీలకు పనులు జరిగే చోట ఈ ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
అన్ని వసతులు కల్పించాలి..
ఉపాధి పనులు జరిగే చోట తాగునీరు, నీడ కోసం టెంట్ వంటి వసతులు ఏమీ లేకపో వడంతో ఎండ వేడి మికి తట్టుకోలేక అవస్థలు పడాల్సి వ స్తుంది. పనులు కూడా ఊరికే చాలా దూ రంలో ఏర్పాటు చేస్తున్నారు. అంత దూ రం నడిచి వెళ్లినా కానీ ఫోటోలు తీస్తే ము ఖాలలో గుర్తించకపోవడంతో చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి అధికారు లు పనులు జరిగే చోట అన్ని వసతులు కల్పించాలి.
బానోతు లాలూ నాయక్, ఉపాధి కూలీ, మఠంపల్లి
వసతుల ఏర్పాట్లకు కృషి చేస్తాం
ఫోటో క్యాప్చరింగ్ విషయంలో బాధితులు ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకో వాలి, అదేవిధంగా ఎండ తీవ్రత వల్ల నీడ కోసం టెంటు, తాగు నీరు, మజ్జిగ ఏర్పా టు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విషయం తెలియజేస్తాం. మొత్తా నికి పనులు జరిగే చోట ఉపాది కూలీలు ఏ ఇబ్బందులు పడకుండా పనులు కొనసాగేలా ఏర్పాట్లు చేస్తాం..
ఉమ, ఏపీఓ, మఠంపల్లి






