ప్రజలు బాగుండాలని మొక్కుకున్నా..
మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
హుస్నాబాద్, సెప్టెంబరు 5 : హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ హుస్నాబాద్లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జనం సందర్భంగా ఆయన ఈ పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ, వినాయకుడి ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరిగింది.






