18 July, 2026 | 9:24 AM

పెద్ద డైలమాలో ఉన్నా..

13-06-2024 12:49 AM

రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిన రాహుల్ 

ఏ స్థానం ఖాళీ చేయాలో అర్థం కావట్లేదంటూ రాహుల్ కామెంట్

మలప్పురం, జూన్ 12: వయనాడ్, రాయ్‌బరేలీలో ఏ స్థానాన్ని వదులుకోవాలో అర్థం కావట్లేదని, ఈ విషయంలో డైలమాలో ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రాహుల్ గెలుపొందారు. అయితే ఈ రెండింట్లో ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, బుధవారం కేరళలోని మలప్పురంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నన్ను రెండో సారి ఎంపీగా గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఓ గందరగోళ పరిస్థితిలో ఉన్నా.. వయనాడ్ ఎంపీగా ఉండాలా..? రాయ్‌బరేలీ ఎంపీగా ఉండాలా అనే విషయంలో ఇబ్బంది పడుతున్నా. అయితే నేను తీసుకునే నిర్ణయంతో అటు రాయ్‌బరేలీ ప్రజలు, ఇటు వయనాడ్ ప్రజలు సంతృప్తి చెందుతారని మాత్రం మాటివ్వగలను’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పరమాత్మ స్వరూపాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు. ‘దురదృష్టవశాత్తు నన్ను ఏ దేవుడూ నిర్దేశించట్లేదు. నేనో సాధారణ మనిషిని. నరేంద్రమోదీ పరమాత్మ.. అదానీ, అంబానీల కోసం ఏమేం నిర్ణయాలు తీసుకోవాలో చెబుతుంటుంది. నాకు అలాంటి వెసులుబాటు లేదాయె. నాకు ఈ దేశంలోని పేద ప్రజలే దేవుళ్లు. వయనాడ్ ప్రజలే నాకు దేవుళ్లు. నేను వారితో మాట్లాడుతాను. నేనేం చేయాలో వారే చెబుతారు. ఇది చాలా సులువు’ అని రాహుల్ పేర్కొన్నారు.