25 August, 2026 | 3:25 PM

నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

25-08-2026 02:54 PM

బోధన్‌, ఆగస్టు 25 (విజయ క్రాంతి): నషాముక్త్‌ సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. మాదకద్రవ్యాల ప్రభావానికి యువత దూరంగా ఉండి విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశసేవ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. బోధన్‌ పట్టణంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో యువత కోసం నిర్వహించిన యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు నషాముక్త్‌ భారత్‌ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

నషాముక్త్‌ భారత్‌ ప్రజా ఉద్యమంగా మారాలి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌’ విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని గవర్నర్‌ తెలిపారు. మాదకద్రవ్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు యువతలో అవగాహన, చైతన్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈగల్‌ కార్యక్రమంతో పాటు పోలీసుశాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్‌ కమిటీలు, ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులను చైతన్యపరచడం మంచి ప్రయత్నమన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో మాదక, హానికర పదార్థాల లభ్యతను అరికట్టడంతో పాటు బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్‌, పునరావాస సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

యువతే దేశానికి బలం

యువతలోని శక్తి, ప్రతిభ, కలలే దేశానికి అతిపెద్ద సంపద అని గవర్నర్‌ పేర్కొన్నారు. వాటిని మాదకద్రవ్యాలకు బలి చేయవద్దని విద్యార్థులకు సూచించారు. స్వామి వివేకానంద సందేశమైన ‘లేచి నిలబడండి.. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అనే స్ఫూర్తిని యువత జీవితంలో ఆచరించాలన్నారు. క్షణిక ఆకర్షణలు, ఆసక్తుల కారణంగా యువత తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించిన గవర్నర్‌, ప్రతి యువకుడు విచక్షణ, ఆత్మనియంత్రణను జీవితానికి మార్గదర్శకంగా చేసుకోవాలని సూచించారు. మిత్రుల్లో ఎవరైనా మాదకద్రవ్యాల వైపు వెళ్తున్నట్లు గుర్తిస్తే వారిని ఒంటరిగా వదిలేయకుండా కౌన్సెలింగ్‌ ద్వారా సరైన దారిలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక బాధ్యత

పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం సంభాషిస్తూ నమ్మకం, ఆప్యాయతతో వ్యవహరించాలని గవర్నర్‌ సూచించారు. తాను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నషా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. యువత, కుటుంబాలు, విద్యాసంస్థలు, స్థానిక సమాజం సమష్టిగా పనిచేస్తే సామాజిక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. తెలంగాణలో ‘నషాముక్త్‌ భారత్‌ జన ఆందోళన్‌’లో భాగంగా జూన్‌ 19న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సీఎం, మంత్రివర్గ సభ్యుల సమక్షంలో విద్యార్థులతో నషాముక్త్‌ జీవితం కోసం ప్రతిజ్ఞ చేయించిన విషయాన్ని గుర్తుచేశారు.

నిజామాబాద్‌ మరింత అభివృద్ధి చెందాలి

నిజామాబాద్‌ గొప్ప చరిత్ర, సంస్కృతి, సాహిత్య వారసత్వానికి ప్రతీక అని గవర్నర్‌ అన్నారు. వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, సమగ్ర అభివృద్ధి రంగాల్లో జిల్లా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి పాఠశాల సురక్షితంగా, ప్రతి యువత చైతన్యవంతంగా, ప్రతి కుటుంబం మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి రక్షితంగా ఉండేలా సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన యువతే బలమైన సమాజాన్ని నిర్మిస్తుందని, బలమైన సమాజమే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. నషాముక్త్‌ తెలంగాణ, నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

నషాతో సర్వం వినాశనమే: ఎంపీ అర్వింద్‌

మాదకద్రవ్యాల వినియోగంతో సర్వం వినాశనమేనని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు నషాముక్త్‌ భారత్‌ కోసం విస్తృతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. డ్రగ్స్‌ మత్తులో ఉన్నవారిని వదిలేయకుండా వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేలా సమాజం సహకరించాలని కోరారు. దేశ అభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉందన్నారు.



యాంటీ డ్రగ్‌ ప్రతిజ్ఞ

అంతకుముందు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా లక్ష మంది సంతకాలతో రూపొందించిన యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, యువతతో నషాముక్త్‌ భారత్‌ ప్రతిజ్ఞ చేయించారు. నషాముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు అందించి అభినందించారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్‌, నగర మేయర్‌ ఉమారాణి, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పి. రాకేష్‌ రెడ్డి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్యతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.