పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి
నిజామాబాద్ ఐడీఓసీకి చేరుకున్న గవర్నర్
ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు
బోధన్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం ద్వారానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్‌తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి.రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ ఉన్నారు. అక్కడ నుంచి ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జన్మదినం జరుపుకొంటున్న ఎంపీ అరవింద్‌కు గవర్నర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అతిథి గృహంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎల్ నినో ప్రభావం ఏమైనా ఉందా? అని వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీశారు. రైతులు ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ భవేష్ మిశ్రా గవర్నర్‌కు వివరించారు.







